రాష్ట్రాల బోర్డు పరీక్షలపై సుప్రీంకోర్టులో విచారణ... ఏపీ నిర్ణయం పట్ల ధర్మాసనం అభినందనలు

25-06-2021 Fri 15:36
  • కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలపై అనిశ్చితి
  • తీవ్రంగా పరిగణిస్తున్న సుప్రీంకోర్టు
  • పరీక్షలు రద్దు చేసినట్టు కోర్టుకు తెలిపిన ఏపీ సర్కారు
  • ముందే రద్దు చేస్తే బాగుండేదన్న జస్టిస్ ఖన్విల్కర్
Supreme Court hearing on states board exams amidst corona pandemic

కరోనా వ్యాప్తి నేపథ్యంలో అనేక రాష్ట్రాల బోర్డుల పరీక్షలపై నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణకు ఏపీ ప్రభుత్వం కూడా హాజరైంది. రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేసినట్టు ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. పరీక్షల రద్దుపై ముందే నిర్ణయం తీసుకుంటే బాగుండేదని జస్టిస్ ఖన్విల్కర్ అభిప్రాయపడ్డారు. పరీక్షల రద్దు నిర్ణయం తీసుకున్న సందర్భంగా నిన్న ఏం చర్చించారని ధర్మానసం ఏపీ సర్కారును అడిగింది.

విచారణ తర్వాత సీఎం వెంటనే పరీక్షల రద్దు నిర్ణయం తీసుకున్నారని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది వెల్లడించారు. సవ్యరీతిలో నిర్ణయం తీసుకున్నారంటూ ధర్మాసనం ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వాన్ని అభినందించింది. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షల అంశం మానవీయతకు సంబంధించిన విషయం అని ధర్మాసనం పేర్కొంది. జులై 31 లోగా అన్ని రాష్ట్రాల బోర్డులు పరీక్షల ఫలితాలు వెల్లడించాలని స్పష్టం చేసింది.