Perni Nani: తెలంగాణ నేతలు భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు.. వైయస్సార్ ఎంత చేశాడో అందరికీ తెలుసు: పేర్ని నాని

Telangana leaders are tempting peoples emotions says Perni Nani
  • వైయస్సార్ ను నరరూప రాక్షసుడన్న శ్రీనివాస్ గౌడ్
  • భావోద్వేగాలను రెచ్చగొట్టాలనే ఆలోచన మాకు లేదన్న పేర్ని నాని
  • నీటి వినియోగంపై చర్చలకు జగన్ సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్య
దివంగత వైయస్సార్, ఏపీ ముఖ్యమంత్రి జగన్ లపై టీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. వైయస్సార్ ఒక నరరూప రాక్షసుడని టీఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈరోజు విమర్శించారు. జగన్ ఒక ఊసరవెల్లిలా తయారయ్యాడని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, తెలంగాణ నేతలు విమర్శలు చేస్తూ, జనాల్లో భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణకు వైయస్సార్ ఎంత చేశాడో అందరికీ తెలుసని చెప్పారు. భావోద్వేగాలను రెచ్చగొట్టాలనే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని చెప్పారు.

ఇరుగుపొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఉండాలనేదే తమ ముఖ్యమంత్రి జగన్ విధానమని పేర్ని నాని అన్నారు. కృష్ణా నది నుంచి తాము ఒక్క గ్లాసు నీళ్లను కూడా ఎక్కువగా తీసుకోవడం లేదని చెప్పారు. నాగార్జునసాగర్, శ్రీశైలంలో కేటాయించిన నీటినే వాడుకుంటున్నామని అన్నారు. కృష్ణా జలాల వినియోగంపై ఏవైనా సందేహాలుంటే చర్చించేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. నీటి వివాదంపై తెలంగాణ నేతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని... వారి ధోరణి సరికాదని అన్నారు.

10వ తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దయితే చంద్రబాబు పైశాచిక ఆనందం పొందుతున్నారని పేర్ని నాని మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాలతోనే పరీక్షలను తమ ప్రభుత్వం రద్దు చేసిందని చెప్పారు. పిల్లల భవిష్యత్తును చంద్రబాబు రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారని మండిపడ్డారు.
Perni Nani
Jagan
YSRCP
Telangana Leaders
Water Dispute

More Telugu News