కలలో పదే పదే రేప్​ చేస్తున్నాడంటూ బాబాపై మహిళ ఫిర్యాదు.. అరెస్ట్ కూడా చేసిన వైనం!

25-06-2021 Fri 14:55
  • బీహార్ లోని ఔరంగాబాద్ లో ఘటన
  • కుమారుడికి జబ్బు చేస్తే బాబా దగ్గరికి తీసుకెళ్లానన్న మహిళ
  • మంత్రం చెప్పి పంపాడని ఫిర్యాదులో వెల్లడి
  • బాబాను అరెస్ట్ చేసి.. విడిచిపెట్టిన పోలీసులు
Raped in dream Bihar woman brings bizzare charge against occultist

ఓ బాబా తనపై కలలో పదే పదే అత్యాచారానికి పాల్పడుతున్నాడంటూ ఓ మహిళ వింత ఫిర్యాదు చేసింది. అది ఒకెత్తయితే.. ఆమె ఫిర్యాదుతో పోలీసులు ఆ బాబాను అరెస్ట్ చేయడం మరొక ఎత్తు. ఈ ఘటన బీహార్ లోని ఔరంగాబాద్ లో జరిగింది. జబ్బు చేసిన తన కుమారుడికి నయం చేయాలంటూ ఈ ఏడాది జనవరిలో బాబా దగ్గరకు వెళ్లానని, అతడు ఓ మంత్రం చెప్పి, పలు పూజలు చేయాల్సిందిగా చెప్పాడని ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొంది. అయితే, ఆ తర్వాత 15 రోజులకే తన కొడుకు చనిపోయాడని వాపోయింది.

దీంతో ఆమె బాబా వద్దకు వెళ్లి కొడుకు ఎందుకు చనిపోయాడని నిలదీసింది. ఆ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆపై, ఆమె అతనిపై ఆగ్రహం ప్రదర్శిస్తూ.. ఎందుకు కలలో తనపై అఘాయిత్యానికి పాల్పడుతున్నావంటూ ప్రశ్నించింది. అంతేకాదు.. అతడు అత్యాచారం చేయబోతే పలు మార్లు చనిపోయిన తన కుమారుడొచ్చి కాపాడాడని పేర్కొంది.

ఆ తర్వాత పోలీసుల వద్దకు వచ్చి ఇదే విషయాన్ని ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు తీసుకున్న పోలీసులు.. బాబాకు నోటీసులిచ్చి అరెస్ట్ కూడా చేశారు. తర్వాత సరైన ఆధారాలు లేని కారణంగా అతడిని విడిచిపెట్టారు.

మహిళ మానసిక స్థితి సరిగ్గా లేదని ఔరంగాబాద్ డీఎస్పీ లలిత్ నారాయణ్ చెప్పారు. ఆమె బంధువులను పోలీసులు ఆరా తీయగా.. మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాల్సిందిగా వారు కోరారని తెలిపారు.