China: అరుణాచల్​ సరిహద్దులోని టిబెట్ ప్రాంతానికి బుల్లెట్​ రైలును ప్రారంభించిన చైనా

  • దుందుడుకుగా వ్యవహరిస్తున్న డ్రాగన్ దేశం
  • చైనాలోని చెంగ్డూ నుంచి టిబెట్ లోని న్యింగ్చి వరకు రైలు
  • టిబెట్ లో రెండో బుల్లెట్ రైల్వేలైన్
  • సైన్యాన్ని వేగంగా మోహరించేందుకేనంటున్న నిపుణులు
China Runs Electrified Bullet Train To Close To Aunachal Borders

సరిహద్దుల్లో ఇప్పటికే బలగాలను మోహరిస్తూ దుందుడుకుగా వ్యవహరిస్తున్న చైనా.. ఇప్పుడు మన సరిహద్దుల వరకు బుల్లెట్ రైలును నడిపి మరింత రెచ్చగొట్టింది. అరుణాచల్ ప్రదేశ్ కు అత్యంత సమీపంలో ఉండే టిబెట్ లోని లాసా–న్యింగ్చి ప్రావిన్సులకు ఇవ్వాళ బుల్లెట్ రైలును ప్రారంభించింది. జులై 1న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) శతాబ్ది ఉత్సవాల సందర్భంగా సిచువాన్–టిబెట్ రైల్వేలో భాగమైన 433.5 కిలోమీటర్ల లాసా–న్యింగ్చి సెక్షన్ ను ప్రారంభించింది.

ఇది పూర్తిగా విద్యుత్ తో నడిచే రైలు అని షిన్హువా వార్తా సంస్థ ప్రకటించింది. ఇప్పటికే టిబెట్ లో ఖింగాయ్– టిబెట్ రైల్వే లైన్ ను ప్రారంభించిన చైనా.. తాజాగా సరిహద్దుల్లో అత్యంత కీలకమైన అరుణాచల్ ప్రదేశ్ కు అతిదగ్గరగా సిచువాన్– టిబెట్ రైల్వే మార్గాన్ని నిర్వహణలోకి తెచ్చింది. సరిహద్దు స్థిరత్వానికి దోహదం చేసే ఈ రైల్వే లైన్ ను వేగంగా పూర్తి చేయాలని గత ఏడాది నవంబర్ లోనే అధికారులను చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ ఆదేశించారు.

చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ రాజధాని అయిన చెంగ్డూలో ప్రయాణం మొదలుపెట్టే ఈ రైలు.. యాన్, టిబెట్ లోని ఖామ్డో మీదుగా లాసాకు చేరుకుంటుంది. ఈ రైలుతో చెంగ్డూ నుంచి లాసా–న్యింగ్చికి 48 గంటల ప్రయాణం కాస్తా 13 గంటలకు తగ్గనుంది. అరుణాచల్ ప్రదేశ్  సరిహద్దులకు అతి దగ్గరగా ఉండే న్యింగ్చి వరకు రైలును నడిపి చైనా వ్యూహాత్మకంగా దెబ్బకొట్టేందుకు చూస్తోందని నిపుణులు చెబుతున్నారు.

దీని ద్వారా వీలైనంత వేగంగా సైన్యాన్ని సరిహద్దులకు తరలించవచ్చన్నదే చైనా వ్యూహమంటున్నారు. అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ ఎప్పటినుంచో చైనా మొండి వాదన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రెండేళ్ల క్రితం డోక్లాం వద్ద సైన్యాన్ని చైనా మోహరించింది. దీటుగా భారత్ కూడా మోహరింపులు చేసింది. కొన్ని నెలల పాటు సాగిన స్టాండాఫ్ లో చివరకు చైనా వెనక్కు తగ్గింది.

ఆ తర్వాత గాల్వాన్ లో ఘర్షణకు దిగింది. ఈ నేపథ్యంలో ఈ ఘర్షణ వాతావరణం ఇలాగే కొనసాగితే యుద్ధ సామగ్రి, ఆయుధాలు, సైన్యాన్ని సరిహద్దులకు ఈ బుల్లెట్ ట్రైన్ ద్వారా వేగంగా చేరవేయొచ్చని షింగ్వా యూనివర్సిటీలోని నేషనల్ స్ట్రాటజీ ఇనిస్టిట్యూట్ రీసెర్చ్ విభాగ డైరెక్టర్ ఖియాన్ ఫెంగ్ చెప్పారు.

More Telugu News