Vijay Sai Reddy: ఇది 18వ శతాబ్దం కాదు... నీ ఆటలు ఇక సాగవు అశోక్!: విజయసాయిరెడ్డి ఫైర్

  • మాన్సాస్ చైర్మన్ గా మళ్లీ అశోక్ గజపతి
  • ఇటీవలే కోర్టు ఆదేశాలు
  • వైసీపీ నేతల విమర్శనాస్త్రాలు
  • చరిత్రను ఉదహరిస్తూ విజయసాయి వాగ్బాణాలు
Vijayasai Reddy fires on Ashok Gajapathi Raju

విజయనగరం గజపతిరాజుల చరిత్రను ప్రస్తావిస్తూ టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాండ్ర పాపారాయుడన్నా, బొబ్బిలి వెలమ రాజులన్నా పౌరుషానికి ప్రతీక అని వెల్లడించారు. ఫ్రెంచ్, బ్రిటీష్ సేనలను, పొరుగు రాజ్యం కుట్రలను ఎదుర్కొని, వీరోచితంగా పోరాడి ప్రాణాలు అర్పించారని వివరించారు. కానీ విజయరామ గజపతిలా వారు విదేశీయుల ఎంగిలి మెతుకుల కోసం ఎగబడలేదని తెలిపారు. విజయరామ గజపతి... హైదర్ జంగ్, బుస్సీ దొరకు లంచం ఇచ్చి బొబ్బిలి కోటపై దొంగదెబ్బ కొట్టాడని చరిత్రను ఉదహరించారు.

ఇప్పుడు అశోక్ గజపతి రాజు కూడా తండ్రి పీవీజీ రాజులా కాకుండా విజయరామ గజపతిలా మారాడని విజయసాయిరెడ్డి విమర్శించారు. చంద్రబాబుకు కప్పం కడుతూ కుట్రలు చేస్తున్నాడని ఆరోపించారు.

"ఇది 18వ శతాబ్దం కాదు... నీ ఆటలు ఇక సాగవు అశోక్. గజపతులంటే ఎన్నడూ ప్రజల పక్షాన నిలబడని మోతుబరి జమిందారులు. గోల్కొండ సుల్తానులకు, నిజాం నవాబులకు బానిసలు. ఫ్రెంచ్ సైన్యాధిపతి బుస్సీతో చేతులు కలిపి బొబ్బిలి వెలమ రాజులను దెబ్బతీశారు. అలాంటి ఈ గజపతులు ప్రజలను పీడించి, బ్రిటీష్ వారికి కప్పం కట్టేవారు. స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటీష్ వాళ్లతో కలిసి ప్రజలను హింసించారు. ఈ నేపథ్యంలో పీవీజీ, ఆనంద గజపతిని కాదని పాత వారసత్వాన్నే కొనసాగిస్తున్నావా అశోక్? కప్పం చంద్రబాబుకు కడుతున్నావా... పప్పునాయుడుకా? ఎన్టీఆర్ కు వెన్నుపోటుకు మీ పూర్వీకులే స్ఫూర్తా?" అంటూ విజయసాయి విమర్శలు గుప్పించారు.

ఇటీవల మాన్సాస్, సింహాచలం దేవస్థానం ట్రస్టులకు చైర్మన్ గా అశోక్ గజపతిరాజునే పునర్నియమించాలంటూ న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. అప్పటి నుంచి వైసీపీ నేతలకు, అశోక్ గజపతిరాజుకు మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది.

More Telugu News