ఏపీపీఎస్సీపై కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు: కమిషన్ సభ్యుడు సలాంబాబు

25-06-2021 Fri 14:16
  • డిజిటల్ మూల్యాంకనం గురించి లోకేశ్ కు అవగాహన లేదు
  • ఇంటర్వ్యూల కోసం ఇప్పుడు బహుళ బోర్డులు ఏర్పాటు చేశాం
  • డబ్బులు చేతులు మారాయన్న లోకేశ్ ఆరోపణలను సహించబోము
Some people are making unnecessary comments on APPSC says Salam Babu

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పై కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని కమిషన్ సభ్యుడు సలాంబాబు మండిపడ్డారు. రాజకీయపరమైన నిరాధార విమర్శలు గుప్పిస్తున్నారని దుయ్యబట్టారు. డిజిటల్ మూల్యాంకనం గురించి కనీస అవగాహన కూడా లేని టీడీపీ నేత నారా లోకేశ్ కూడా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. లోకేశ్ కు ఏమైనా సందేహాలు ఉంటే అపాయింట్ మెంట్ తీసుకుని వస్తే, తాము సందేహాలను నివృత్తి చేస్తామని చెప్పారు.

ఏపీపీఎస్సీలో గతంలో ఇంటర్వ్యూల కోసం సింగిల్ బోర్డు ఉండేదని, ఇప్పుడు బహళ బోర్డులు చేశామని సలాంబాబు అన్నారు. ఏ సభ్యుడు ఏ బోర్డుకు వెళ్తారో కూడా తెలియదని చెప్పారు. గ్రూప్-1 పరీక్షలో ఒక అభ్యర్థి నెల్లూరులో 2 పేపర్లు, హైదరాబాదులో 5 పేపర్లు రాశాడనే ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు. సదరు అభ్యర్థి అన్ని పేపర్లను హైదరాబాదులోనే రాశాడని తెలిపారు.

జీవో ప్రకారం రెండు శాతం పోస్టుల్ని స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేయాలనే నిబంధనలు ఉన్నాయని... ఆ కోటాకు అర్హులు లేకపోతే ఓపెన్ కేటగిరీలో భర్తీ చేయాలని రూల్స్ చెబుతున్నాయని సలాంబాబు చెప్పారు. ఇంటర్వ్యూలకు ఏ రేషియోలో పిలవాలనే అధికారం సర్వీస్ కమిషన్ కు ఉంటుందని అన్నారు. డిజిటల్ మూల్యాంకనం రూల్స్ మార్చారనే విమర్శలు సరికాదని చెప్పారు. నోటిఫికేషన్ లో వయసు, విద్యార్హతలను మార్చితే దాన్ని నిబంధనలను మార్చడం అంటారని అన్నారు.

కమిషన్ లో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని లోకేశ్ తో పాటు ఎవరైనా ఆరోపణలు చేస్తే సహించబోమని సలాంబాబు చెప్పారు. ఆరోపణలకు ఏవైనా ఆధారాలుంటే కోర్టుకు సమర్పించవచ్చని సూచించారు.