వచ్చే ఏడాదే ఐఎన్​ఎస్​ విక్రాంత్​.. దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవానికి కానుకన్న రక్షణ మంత్రి

25-06-2021 Fri 13:41
  • తొలి స్వదేశీ యుద్ధ విమాన వాహక నౌక నిర్మాణంపై సమీక్ష
  • కర్వార్ లో అతిపెద్ద నేవీ బేస్ ‘ప్రాజెక్ట్ సీ బర్డ్’పైనా రివ్యూ
  • ఆత్మనిర్భర్ భారత్ కు మచ్చుతునక అని ప్రశంస
First Indigenous Aircraft Carrier Will be Commissioned By Next Year Says Rajnath Singh

దేశ మొట్టమొదటి ‘దేశీయ’ యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను వచ్చే ఏడాదే ప్రారంభిస్తామని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. నౌక నిర్మాణ పురోగతిపై కేరళ కొచ్చిలోని నేవల్ కమాండ్ లో ఆయన సమీక్ష చేశారు. ‘ఆత్మనిర్భర్ భారత్’కు ఐఎన్ఎస్ విక్రాంత్ ఒక మచ్చుతునక అని, అది దేశానికే గర్వ కారణమని కొనియాడారు.


75వ స్వాతంత్ర్యదినోత్సవ కానుకగా దేశానికి ఈ నౌకను వచ్చే ఏడాది ప్రారంభిస్తామన్నారు. ఐఎన్ఎస్ విక్రాంత్ తో తీర ప్రాంతంలో దేశ ప్రయోజనాలను కాపాడుకుంటామన్నారు. ఐఎన్ఎస్ విక్రాంత్ తో పాటు ‘ప్రాజెక్ట్ సీ బర్డ్’ పేరిట కర్వార్ లో నిర్మిస్తున్న అతిపెద్ద నౌకదాళ బేస్ పైనా ఆయన సమీక్ష నిర్వహించారు. నౌకాదళాన్ని మరింత శక్తిమంతంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ఈ రెండు ప్రాజెక్టులే రక్షణ రంగంలో తమ నిబద్ధతకు నిదర్శనమన్నారు.

ఆధునికీకరణపై తాము చూపిస్తున్న శ్రద్ధ వల్లే దేశీయ పరిశ్రమలకు ప్రాధాన్యం దక్కుతోందని చెప్పారు. 44 యుద్ధ నౌకల్లో 42 నౌకలను భారత షిప్ యార్డుల్లో తయారు చేయడమే అందుకు నిదర్శనమన్నారు. ఐఎన్ఎస్ విక్రాంత్ లో 75 శాతం వరకు స్వదేశీ సామగ్రినే వాడుతున్నామని రాజ్ నాథ్ చెప్పారు. ఉక్కు నుంచి నిర్మాణం వరకు, సెన్సర్ల నుంచి ఆయుధాల వరకు దేశీయంగా తయారు చేసినవేనన్నారు.  

ప్రాజెక్ట్ 75ఐ ఆర్ఎఫ్పీ (ప్రతిపాదనలు)కి ఇటీవలే రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ) ఆమోదం తెలిపిందని ఆయన గుర్తు చేశారు. వ్యూహాత్మక భాగస్వామ్య నమూనా కింద దీనిని అభివృద్ధి చేస్తామన్నారు. ఎలాంటి సవాళ్లు ఎదురైనా ఎదుర్కొనేందుకు భారత నౌకాదళం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. గాల్వాన్ ఘర్షణల నేపథ్యంలో నౌకాదళం ఎంత వేగంగా స్పందించిందో గుర్తు చేశారు. కరోనా మహమ్మారితో పోరులోనూ నేవీ కృషి ఎనలేనిదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ‘సాగర్ (సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన ద రీజియన్– ఇండో పసిఫిక్ ప్రాంతంలో సమగ్రాభివృద్ధి, భద్రత)’ కింద ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాల కోసం ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన చెప్పారు.