V Srinivas Goud: వైయస్ రాజశేఖరరెడ్డి ఒక నరరూప రాక్షసుడు.. జగన్ ఊసరవెల్లి: టీఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు

YSR is a robber says TS minister Srinivas Goud
  • తెలంగాణకు వైయస్ చేసిన నష్టం అంతాఇంతా కాదు
  • దోచుకుపోయిన వాడిని దొంగ అనకపోతే ఇంకేమనాలి?
  • నక్సలైట్ల పేరుతో ఎందరినో వైయస్ చంపించేశారు
మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైయస్ రాజశేఖరరెడ్డిపై తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్సార్ ఒక నరరూప రాక్షసుడని మండిపడ్డారు. తెలంగాణకు వైయస్ చేసిన నష్టం అంతాఇంతా కాదని.. తండ్రి తప్పు చేసినా.. కొడుకు (వైయస్ జగన్) మంచి చేస్తాడని అనుకున్నామని.... కానీ, మామిడి చెట్టుకు మామిడి కాయలే కాస్తాయి, చింత చెట్టుకు చింతకాయలే కాస్తాయని విమర్శించారు.

వైయస్ కడుపులో పుట్టినా అదే పద్ధతిలో జగన్ ఉంటాడని అనుకోలేదని... మనుషుల్లో మార్పు వస్తుందని అనుకున్నామని, రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని కోరుకున్నామని అన్నారు. కానీ జగన్ తీరు కూడా దారుణంగా ఉందని అన్నారు.

రాజశేఖర్ రెడ్డిని దొంగ అనగానే వైసీపీ నేతలు ఎగిరెగిరి పడుతున్నారని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. తెలంగాణకు అడుగడుగున వైయస్ నష్టం చేశాడని అన్నారు. దోచుకుపోయినవాడిని దొంగ అనకపోతే ఇంకేమనాలని ప్రశ్నించారు. గతంలో వైయస్ దోచుకుపోయాడని, ఇప్పుడు ఆయన కొడుకు జగన్ దోచుకుపోతున్నాడని ఆరోపించారు. అందుకే దొంగ, గజదొంగ అని అంటున్నామని చెప్పారు. మమ్మల్ని దోచుకుంటే మాకు కడుపు మండదా? అని ప్రశ్నించారు.

పోతిరెడ్డిపాడు కోసం దివంగత పీజేఆర్ కొట్లాడారని... ఆ తర్వాత ఏం జరిగిందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పీజేఆర్ చావుకు వైయస్సార్ కారణం కాదా? అని ప్రశ్నించారు. పీజేఆర్ ను వైయస్ ఎంతో క్షోభ పెట్టాడని మండిపడ్దారు. ఎందరో తెలంగాణ ప్రజలను నక్షలైట్ల పేరుతో చంపిన చరిత్ర వైయస్ దని దుయ్యబట్టారు. వైయస్సార్ అంటే కేవలం దొంగ మాత్రమే కాదని... ఒక నరరూప రాక్షసుడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వెనుకబాటుతనానికి, ఎంతో మంది చావుకు వైయస్ కారణమని అన్నారు.

తమ మహబూబ్ నగర్ జిల్లా నుంచి 14 లక్షల మంది జనం వలస పోవడానికి వైయస్సార్ కారణం కాదా? అని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. మహబూబ్ నగర్ జిల్లాకు శాశ్వత నష్టం చేసే ప్రయత్నాలను ఏపీ ప్రభుత్వం చేస్తోందని అన్నారు. నిన్నటి వరకు మంచితనం ప్రదర్శించిన జగన్ ఇప్పుడు ఊసరవెల్లిలా మారారని మండిపడ్డారు. నోట్లో చక్కెర పోసి కడుపుతో కత్తులు గుచ్చినట్టు ఏపీ పాలకుల తీరు ఉందని దుయ్యబట్టారు. జరుగుతున్న దోపిడీని కేసీఆర్ చూస్తూ ఊరుకోబోరని హెచ్చరించారు.
V Srinivas Goud
TRS
YSR
Jagan
YSRCP
Robber

More Telugu News