ఉరితాడుతో టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు వినూత్న నిరసన

25-06-2021 Fri 12:20
  • రైతులకు ధాన్యం బకాయిలు విడుదల చేయాలని డిమాండ్
  • బకాయిలు విడుదల చేయకపోతే రైతులకు ఉరే శరణ్యమని వ్యాఖ్య
  • రంగుల ప్రకటనలకే ప్రభుత్వం పరిమితమయిందని విమర్శ
TDP MLA Rama Naidu protests for farmers

రైతులకు తక్షణమే ధాన్యం బకాయిలను చెల్లించాలంటూ టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు వ్యవసాయ కార్యాలయం వద్ద ఉరితాడుతో కాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. రైతులకు బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే వారికి ఉరే శరణ్యమని అన్నారు.

గత పంటకు సంబంధించి రూ. 4 వేల కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని చెప్పారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని... పంటను పండించడం కంటే అమ్ముకోవడమే కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తమది రైతు ప్రభుత్వం అంటూ రంగుల ప్రకటనలకే వైసీపీ ప్రభుత్వం పరిమితమయిందని ఎద్దేవా చేశారు. కట్టని ఎన్స్యూరెన్సులు, అరకొర ఇన్ పుట్ సబ్సిడీతో రైతులను సీఎం జగన్ నట్టేట ముంచారని విమర్శించారు.