New Delhi: అవసరానికి మించి 4 రెట్ల ఆక్సిజన్​ ను ఎక్కువగా తీసుకున్న ఢిల్లీ ప్రభుత్వం: తేల్చి చెప్పిన సుప్రీం కోర్టు ప్యానెల్​

  • 289 టన్నులే అవసరం
  • 1,149 టన్నులు తీసుకున్న ఢిల్లీ
  • 12 రాష్ట్రాలకు తీవ్ర ఇబ్బందులు
  • తప్పుడు లెక్కలతో ఎక్కువ ఆక్సిజన్
  • ఢిల్లీ సగటు వినియోగం 372 టన్నులే
Delhi Exaggerated Oxygen Requirement By 4 Times Says Supreme Court Panel

సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ దొరక్క జనం ఎలా అల్లాడిపోయారో చూశాం. ఢిల్లీ సహా అనేక రాష్ట్రాల్లో క్యూలో నిలబడి మరీ తమ వారి కోసం ఆక్సిజన్ సిలిండర్లను తీసుకెళ్లారు. ఢిల్లీలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అయితే.. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మరీ ఆక్సిజన్ తెప్పించుకున్నారు. అయితే, అవసరానికి మించి ఆక్సిజన్ ను తెప్పించుకున్నారని సుప్రీం కోర్టు ప్యానెల్ నిగ్గు తేల్చింది.

సుప్రీం కోర్టు నియమించిన ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ రణ్ దీప్ గులేరియా నేతృత్వంలోని ఆక్సిజన్ ఆడిట్ పానెల్ ఇవ్వాళ మధ్యంతర నివేదికను విడుదల చేసింది. ఆ పానెల్ లో ఢిల్లీ హోం శాఖ ముఖ్య కార్యదర్శి భూపీందర్ భల్లా, మ్యాక్స్ హెల్త్ కేర్ డైరెక్టర్ సందీప్ బుద్ధిరాజా, కేంద్ర జలశక్తి సంయుక్త కార్యదర్శి సుబోధ్ యాదవ్ లు ఉన్నారు.

రాష్ట్రానికి సెకండ్ వేవ్ లో 289 మెట్రిక్ టన్నుల ఆక్సిజనే అవసరమున్నా.. దానికి మించి నాలుగు రెట్లు అధికంగా ఢిల్లీ ప్రభుత్వం తీసుకుందని నివేదికలో కమిటీ వెల్లడించింది. 1,140 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను పొందిందని పేర్కొంది. వాస్తవానికి ఆ సమయంలో ఢిల్లీ సగటు వినియోగం 284 టన్నుల నుంచి 372 టన్నుల మధ్యే ఉందని పేర్కొంది. ఢిల్లీ అవసరానికి మించి ఆక్సిజన్ ను తీసుకోవడం, ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ ను ఢిల్లీకే బదలాయించడం వంటి కారణాల వల్ల 12 ఇతర రాష్ట్రాలు తీవ్రంగా ఇబ్బందిపడ్డాయని చెప్పింది.

తక్కువ బెడ్లున్న నాలుగు ఆసుపత్రులైతే మరింత ఎక్కువ ఆక్సిజన్ ను వాడాయని కమిటీ తేల్చింది. ద సింఘాల్ హాస్పిటల్, అరుణ ఆసిఫ్ అలీ హాస్పిటల్, ఈఎస్ఐసీ మోడల్ హాస్పిటల్, లైఫ్ రే హాస్పిటళ్లలో చాలా తక్కువ పడకలు ఉన్నాయని, తప్పుడు లెక్కలు చెప్పి ఎక్కువ ఆక్సిజన్ ను తీసుకున్నాయని పేర్కొంది. దాని వల్ల ఢిల్లీలో ఆక్సిజన్ అవసరాలు డిమాండ్ కు మించి ఏర్పడ్డాయంది. ఈ నాలుగు ఆసుపత్రులే కాకుండా ఇంకా చాలా ఆసుపత్రులూ తప్పుడు సమాచారాన్నే ఇచ్చాయంది.

తమకు ఆక్సిజన్ సరిపోవట్లేదని, 700 టన్నుల ఆక్సిజన్ కావాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీం కోర్టుకు వెళ్లడంతో.. ఆ మొత్తం ఇచ్చేయాలని అప్పట్లో కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. అవన్నీ తప్పుడు లెక్కలు.. కావాలనే ఎక్కువ అడుగుతున్నారని కేంద్రం వివరణ ఇచ్చినా సుప్రీం కోర్టు వినలేదు. దీంతో ఢిల్లీకి 700 టన్నుల ఆక్సిజన్ ను కేంద్రం సరఫరా చేయాల్సి వచ్చింది.

More Telugu News