అన్న‌య్య ఆశీర్వాదాలు కూడా మ‌న‌కు ఉన్నాయి: ప్రకాశ్ రాజ్ 'మా' ప్యాన‌ల్ సభ్యుడు నాగ‌బాబు

25-06-2021 Fri 12:14
  • అందుకు మేము సంతోషిస్తున్నాం
  • అన్న‌య్య‌ను ప్ర‌కాశ్ రాజ్ గారు అడిగారు
  • 'మా'లో పోటీ చేయాల‌ని అన్న‌య్య చెప్పాడు
  • తాను నేరుగా ఇన్వాల్వ్ కాన‌ని చెప్పారు
 Prakash Raj has blessings of Chiranjeevi says Naga Babu

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల నేప‌థ్యంలో ప్ర‌కాశ్ రాజ్ ప్యాన‌ల్ స‌భ్యుడు, సినీన‌టుడు నాగ‌బాబు మీడియాతో మాట్లాడుతూ ప‌లు విష‌యాలు చెప్పారు. ప్ర‌కాశ్ రాజ్ చాలా మంచి వ్య‌క్త‌ని, మస‌క‌బారిన‌ మా అసోసియేష‌న్ ప్ర‌తిష్ఠ మ‌ళ్లీ పెర‌గాల‌ని, చిరంజీవి మ‌ద్ద‌తు త‌మ‌కు ఉంద‌ని చెప్పారు.

'ప్ర‌కాశ్ రాజ్ కు ప్ర‌తి భాష‌తో ట‌చ్ ఉంది. ఎవ‌రితోనైనా స‌రే వారి భాష‌లో మాట్లాడ‌గ‌లిగే స‌త్తా ఉన్న వ్య‌క్తి. ఎవ‌రితో అయినా స‌రే ఏ ప‌ని అయినా స‌రే చేయించుకోగ‌లిగే వ్య‌క్తి. అంతేకాదు, ప్ర‌కాశ్ రాజ్ నాలుగైదు ఏళ్లుగా ఎన్నో సేవా కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు' అని నాగ‌బాబు తెలిపారు.

'మూడు-నాలుగు గ్రామాలు ద‌త్త‌త తీసుకుని సేవ‌లు అందిస్తున్నారు. చాలా మందికి ఇళ్లు క‌ట్టించారు. చాలా మందికి సాయం చేశారు. ఇటువంటి వ్య‌క్తి మా లో ఉంటే ప్ర‌తి ఒక్క‌రూ ఆయ‌న‌ను సంప్ర‌దించొచ్చు. మా అసోసియేషన్‌ మాది అనే భావ‌న క‌లుగుతుంది. ఇందాక ప్ర‌కాశ్ రాజ్ కూడా ఇది ప్ర‌స్తావించారు' అని నాగ‌బాబు చెప్పారు.

'లోకల్, నాన్ లోక‌ల్ అంటూ వాదిస్తున్నారు. అలా వాదించ‌డం అర్థ‌ర‌హితం. ఎందుకంటే మా అసోసియేష‌న్‌లో స‌భ్యత్వం తీసుకున్న ప్ర‌తి వ్య‌క్తికి మా అధ్య‌క్ష ప‌దవి నుంచి ఎగ్జిక్యూటివ్ మెంబ‌ర్ దాకా పోటీ చేసే అవ‌కాశం ఉంటుంది. అమితాబ్ బ‌చ్చ‌న్ వంటి గొప్ప న‌టుడు త‌న‌ను బాలీవుడ్ న‌టుడు అని అన‌కూడ‌ద‌ని, భార‌తీయ న‌టుడు అనాల‌ని అన్నారు. ప్ర‌కాశ్ రాజ్ కూడా ఎక్క‌డ పుట్టాడు.. ఎక్క‌డ పెరిగాడు అన్న విష‌యం అన‌వ‌స‌రం' అన్నారు నాగ‌బాబు.

'లోక‌ల్ కి, నాన్ లోక‌ల్ కి ప్రామాణికం ఏమిటి? అమెరికాలోనే ఇటువంటి ఫీలింగులు లేవు. ఇలాంటి ఫీలింగులే ఉంటే అమెరికాలో క‌మ‌లా హ్యారీస్ ఉపాధ్య‌క్షురాలు అయ్యేవారా? అన్న‌య్య ఆశీర్వాదాలు కూడా మ‌న‌కు ఉన్నాయి. దీనికి సంతోషిస్తున్నాం. అన్న‌య్య‌ను ప్ర‌కాశ్ రాజ్ గారు అడిగిన‌ప్పుడు .. 'మా'లో పోటీ చేయాల‌ని అన్న‌య్య చెప్పాడు' అని నాగ‌బాబు చెప్పారు.

'అయితే, తాను నేరుగా ఇన్వాల్వ్ కాన‌ని చెప్పారు. కానీ, మా అసోసియేష‌న్ మంచి ప‌నులు చేస్తే మ‌ద్ద‌తుగా ఉంటాన‌ని చెప్పారు. ప్ర‌కాశ్ రాజ్ చాలా స‌మ‌ర్థ‌త‌గ‌ల వ్య‌క్తి. కొన్నేళ్లుగా మా అసోసియేష‌న్ ప్ర‌తిష్ఠ మ‌స‌క‌బారింది. ఇక‌పై అలా ఉండ‌కూడ‌దు" అని నాగ‌బాబు వ్యాఖ్యానించారు.