తిరుపతి సమీపంలో భూములను తిరిగి ఏపీ స‌ర్కారుకి ఇచ్చేసిన రిల‌య‌న్స్ సంస్థ‌!

25-06-2021 Fri 11:56
  • ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్ కోసం గ‌తంలో భూములు
  • 15 మంది రైతులు ప‌లు కారణాలతో కోర్టులో కేసులు
  • అవి పరిష్కారం అయ్యే వరకు యూనిట్‌ ఏర్పాటు కష్టం
  • దీంతో యూనిట్ ఏర్పాటుకు రిల‌య‌న్స్ విముఖ‌త
reliance gives lands to ap govt

రిలయన్స్‌ సంస్థకు ఏపీ ప్ర‌భుత్వం తిరుపతి సమీపంలో భూములు ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ ఏర్పాటు కోసం గ‌త స‌ర్కారు 136 ఎకరాలను కేటాయించగా, వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక అందులో 75 ఎకరాలను అప్పగించింది. అయితే, రిలయన్స్‌కు కేటాయించిన భూములకు సంబంధించిన 15 మంది రైతులు ప‌లు  కారణాలతో కోర్టులో కేసులు వేశారు.

ఈ కేసులు పరిష్కారం అయ్యే వరకు యూనిట్‌ ఏర్పాటు చేయటానికి అవకాశం ఉండక‌పోవ‌డంతో రిల‌య‌న్స్ ఆ భూముల‌ను తిరిగి రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ(ఏపీఐఐసీ)కు వెనక్కి ఇచ్చేస్తూ తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రూ.15 వేల కోట్ల పెట్టుబడులతో సెట్‌టాప్‌ బాక్సులు, ఇంటర్నెట్‌ వినియోగానికి అవసరమైన డాంగిల్స్‌ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను విరమించుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

ఈ విష‌యాన్ని తిరుపతి ఏపీఐఐసీ జోనల్‌ కార్యాలయ ఉన్నతాధికారులు ధ్రువీకరించారు. ఆ భూముల కోసం రిల‌యన్స్ డిపాజిట్‌ చేసిన మొత్తాన్ని తిరిగి ఇచ్చే విష‌యంపై చ‌ర్చిస్తున్న‌ట్లు పేర్కొంది. అయితే, తిరుపతి సమీపంలో భూముల‌కు బ‌దులుగా వడమాలపేట మండలం పాడిరేడు అరణ్యం దగ్గర ఎలాంటి వివాదాలు లేని భూములను కేటాయిస్తామని రిల‌య‌న్స్ కు ఏపీఐఐసీ అధికారులు న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నం చేశారు.

అయిన‌ప్ప‌టికీ, ఆ సంస్థ నుంచి ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్ ఏర్పాటుకు సానుకూల స్పందన రాలేదని ఓ అధికారి తెలిపారు. సెట్‌టాప్‌ బాక్సుల అసెంబ్లింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను రిలయన్స్‌ సంస్థ విరమించుకుంది. అధికారులు జ‌రిపిన సంప్ర‌దింపులు ఫ‌లించ‌లేదు.