దుబాయ్ కి రెడీ అవుతున్న 'ఖిలాడి'

25-06-2021 Fri 11:46
  • ముగింపు దశలో 'ఖిలాడి'
  • రవితేజ ద్విపాత్రాభినయం
  • విలన్ గా యాక్షన్ కింగ్ అర్జున్
  • ప్రత్యేక పాత్రలో అనసూయ  
Khiladi shooting in Dubai

రవితేజ తాజా చిత్రంగా 'ఖిలాడి' రూపొందుతోంది. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా 90 శాతం చిత్రీకరణను జరుపుకుంది. మిగతా 10 శాతం షూటింగును పూర్తిచేసే పనిలో ఉన్నారు. చిన్నపాటి షెడ్యూల్ ఒకటి హైద్రాబాద్ లోనే ప్లాన్ చేశారట. ముందుగా దానిని పూర్తి చేసి, ఆ తరువాత షెడ్యూల్ ను దుబాయ్ లో ప్లాన్ చేసినట్టుగా చెబుతున్నారు. ఆ షెడ్యూల్ తో షూటింగు పార్టు పూర్తవుతుందట. అంటే దుబాయ్ లోనే గుమ్మడికాయ కొట్టేస్తారన్న మాట.  

ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఒక కథానాయికగా మీనాక్షి చౌదరి .. మరో కథానాయికగా డింపుల్ హయతి కనువిందు చేయనున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో, ముఖేశ్ రుషి .. సచిన్ కేద్కర్ .. రావు రమేశ్ .. మురళీశర్మ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ప్రత్యేకమైన పాత్రలో అనసూయ మెరవనుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేస్తుందని అంటున్నారు. 'క్రాక్' వంటి భారీ హిట్ తరువాత రవితేజ నుంచి వస్తున్న సినిమా కావడంతో సహజంగానే అంచనాలు భారీగా ఉన్నాయి.