అలాంట‌ప్పుడు నేను నాన్ లోక‌ల్ ఎలా అవుతా?.. అకార‌ణ శ‌త్రుత్వం వ‌ద్దు: ప్రకాశ్ రాజ్

25-06-2021 Fri 10:44
  • అవార్డులు వ‌చ్చిన‌ప్పుడు నాన్ లోక‌ల్ అనే ప్ర‌స్తావ‌న  రాలేదు
  • రెండు గ్రామాల‌ను ద‌త్త‌త తీసుకున్న‌ప్పుడు నాన్ లోకల్ అని అన‌లేదు
  • మ‌రి ఇప్పుడు ఎందుకు నాన్ లోక‌ల్ ప్ర‌స్తావ‌న‌?
  • ఆవేద‌న‌తో పుట్టిన 'సినిమా బిడ్డ‌ల ప్యాన‌ల్' ఇది
  • 'మా' భ‌వ‌నం ఎలా క‌డ‌తామో ముందే చెబుతాం
i am not non local prakash raj

సెప్టెంబర్‌లో జరగాల్సిన మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు ఉత్కంఠభరితంగా మారిన విష‌యం తెలిసిందే. అధ్యక్ష ప‌ద‌వి కోసం ఈ పోటీలో సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌, హీరో మంచు విష్ణుతో పాటు జీవితా రాజశేఖర్‌, హేమ కూడా నిలబడుతున్నట్టు ప్రకటించడంతో ఈ ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. ప్రకాశ్‌ రాజ్ దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఈ రోజు తన ప్యానల్‌ సభ్యులతో క‌లిసి మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.  

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేయాల‌న్న నిర్ణ‌యం ఒక్క‌రోజులో తీసుకున్న‌ది కాద‌ని ప్ర‌కాశ్ రాజ్ చెప్పారు. తాను పోటీ చేయాల‌ని తీసుకున్న నిర్ణ‌యం బాగా ఆలోచించి తీసుకున్న‌ట్లు చెప్పుకొచ్చారు. తాను ఏడాది నుంచి ప్యాన‌ల్ ఏర్పాటుపై ఆలోచ‌న చేసిన‌ట్లు తెలిపారు.

సినీ ప‌రిశ్ర‌మ‌లో అంద‌రూ అంద‌రికీ కావాల్సిన వారేన‌ని ప్రకాశ్‌ రాజ్ చెప్పారు. త‌న‌ను లోక‌ల్.. నాన్ లోకల్ అంటూ కొందరు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నార‌ని, క‌ళాకారులంద‌రూ లోక‌ల్ కాద‌ని యూనివ‌ర్స‌ల్ అని ఆయన వ్యాఖ్యానించారు. అలాంట‌ప్పుడు తాను నాన్ లోక‌ల్ ఎలా అవుతా? అని ప్ర‌శ్నించారు. అకార‌ణ శ‌త్రుత్వం వ‌ద్దని చెప్పారు.  

అవార్డులు వ‌చ్చిన‌ప్పుడు నాన్ లోక‌ల్ అనే ప్ర‌స్తావ‌న ఎందుకు రాలేదు? అని ప్రకాశ్‌ రాజ్ నిల‌దీశారు. అలాగే, రెండు గ్రామాల‌ను ద‌త్త‌త తీసుకున్న‌ప్పుడు న‌న్ను నాన్ లోకల్ అని అన‌లేదని చెప్పారు. మ‌రి ఇప్పుడు ఎందుకు నాన్ లోక‌ల్ ప్ర‌స్తావ‌న‌? అని ప్ర‌శ్నించారు. ఆవేద‌న‌తో పుట్టిన 'సినిమా బిడ్డ‌ల ప్యాన‌ల్' ఇదని తెలిపారు.

కేవ‌లం త‌న‌కు ప‌రిచ‌యం ఉంద‌న్న కార‌ణంతో తాను ఓట్లు అడ‌గ‌డం లేదని.. 'మా' అభివృద్ధికి ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తామ‌ని, అంద‌రూ ఆశ్చ‌ర్య‌పడేలా ప‌నిచేస్తామ‌ని ప్రకాశ్‌ రాజ్ చెప్పుకొచ్చారు. మా భ‌వ‌నం ఎలా క‌డ‌తామో ముందే చెబుతామ‌ని ప్ర‌క‌టించారు. తాను ప‌ద‌వి కోసం రాలేదని, ప‌నిచేయ‌డానికి వ‌చ్చానని అన్నారు. తాను చిన్న త‌ప్పు చేసినా ప్ర‌శ్నించే వారు త‌న‌ ప్యానల్‌లో ఉన్నారని తెలిపారు. త‌న‌కు ప్ర‌శ్నించే వారు, క‌ష్ట‌ప‌డి ప‌ని చేసే వారు కావాల‌ని చెప్పారు.