కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో విజయసాయిరెడ్డి భేటీ

24-06-2021 Thu 21:34
  • ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసిన విజయసాయి
  • ట్విట్టర్ లో వివరాల వెల్లడి
  • వుడా నిధులు తిరిగివ్వాలని వినతి
  • టీటీడీకి జీఎస్టీ మినహాయింపుపై చర్చ
Vijayasai Reddy met Union Minister Nirmala Sitharaman

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఢిల్లీలో నేడు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. ఈ సమావేశంపై విజయసాయి ట్విట్టర్ లో వివరాలు తెలిపారు. ఐటీ అప్పిల్లేట్ ట్రైబ్యునల్ సానుకూల ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో, వైజాగ్ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ గతంలో చెల్లించిన రూ.219 కోట్ల నిధులను వడ్డీతో కలిపి తిరిగివ్వాలని కేంద్ర ఆర్థికమంత్రిని కోరానని వెల్లడించారు. అందుకామె సానుకూలంగా స్పందించారని, నిధుల చెల్లింపునకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారని తెలిపారు.

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్యకలాపాలపై జీఎస్టీ మినహాయింపు కల్పించాలని కూడా నిర్మలా సీతారామన్ ను కోరినట్టు విజయసాయి పేర్కొన్నారు. అంతేకాకుండా, ప్రవాస భారతీయ భక్తులు అందించే విరాళాల స్వీకరణకు వీలుకల్పించే ఎఫ్ సీఆర్ఏ దరఖాస్తు పునరుద్ధరణపైనా ఈ సమావేశంలో ప్రముఖంగా చర్చించినట్టు తెలిపారు.