72 ఏళ్ల వ్యక్తికి 10 నెలల పాటు విడవని కరోనా.... ఎలా కోలుకున్నాడంటే!

24-06-2021 Thu 20:41
  • ఇంగ్లండ్ లోని 72 ఏళ్ల స్మిత్ కు గతేడాది కరోనా 
  • అప్పటి నుంచి 43 సార్లు కరోనా పాజిటివ్
  • ఏ చికిత్స పని చేయని వైనం
  • ఆఖరిగా రెజినరాన్ యాంటీబాడీ థెరపీతో చికిత్స
  • ఆశ్చర్యకరంగా కోలుకున్న స్మిత్
Bristol old man recovers from corona after ten months

ఇంగ్లండ్ లోని బ్రిస్టల్ ప్రాంతానికి చెందిన డేవ్ స్మిత్ ఓ రిటైర్డ్ ఉద్యోగి. స్మిత్ వయసు 72 ఏళ్లు. గత ఏడాది కరోనా వైరస్ ప్రపంచాన్ని కబళిస్తున్న వేళ స్మిత్ కూడా దీని బారినపడ్డాడు. అది మొదలు ఏకంగా 10 నెలల పాటు కరోనా అతడ్ని విడవలేదు. కరోనా టెస్టులు చేస్తే 43 సార్లు పాజిటివ్ గా వచ్చింది. కొన్నాళ్లు ఆసుపత్రిలో, కొన్నాళ్లు ఇంట్లో... ఎలా చికిత్స పొందినా కరోనా మాత్రం నయం కాలేదు. మహమ్మారి ధాటికి మంచానికే పరిమితం అయ్యాడు. చివరికి అన్నీ మంచం మీదే!

ఓ దశలో తాను బతకనని డీలా పడిపోయిన ఆ పెద్దాయన తన అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని కుటుంబ సభ్యులకు చెప్పాడు. అయితే ఈ కేసును వైద్యులు ఓ సవాల్ గా స్వీకరించారు. ఎన్ని చికిత్సలు చేసినా విఫలమైనా, వైద్యులు మాత్రం నిరాశపడలేదు. స్మిత్ శరీర స్థితిపై ఓ అంచనాకు వచ్చిన వైద్యులు ఆఖరిగా రెజినరాన్ యాంటీబాడీ థెరపీ అమలు చేశారు. ఆశ్చర్యం కలిగించే విధంగా, స్మిత్ శరీరం సానుకూలంగా స్పందించింది.

ఎట్టకేలకు 10 నెలల తర్వాత ఆయనకు కరోనా నెగెటివ్ అని వచ్చింది. ఎన్ని పరీక్షలు చేసినా నెగెటివ్ అని రావడంతో స్మిత్ ను కరోనా ఇన్నాళ్లకు వీడినట్టు నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం స్మిత్ ఆనందం అంతా ఇంతా కాదు. దాదాపు మృత్యువు అంచుల వరకు వెళ్లొచ్చిన తర్వాత కుటుంబ సభ్యులను చూసి తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యాడు.