అలీ కోసం రంగంలోకి ప్రభాస్!

24-06-2021 Thu 19:18
  • నిర్మాతగా మారిన అలీ
  • సొంత బ్యానర్లో తొలి సినిమా
  • ప్రభాస్ చేతుల మీదుగా లిరికల్ వీడియో
  • రేపు సాయంత్రం 4:05 గంటలకు రిలీజ్    
Prabhas in Ali movie promotion

ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ .. వందల కోట్ల బడ్జెట్ తో ఆయన సినిమాలు నిర్మితమవుతున్నాయి. వేలకోట్ల రూపాయలను వసూలు చేస్తున్నాయి. అందువలన ఇప్పుడు మార్కెట్ అంతా కూడా ప్రభాస్ వైపే చూస్తోంది. ఇంత స్టార్ డమ్ ఉన్నప్పటికీ ప్రభాస్ అందరికీ అందుబాటులో ఉంటూ ఉండటం విశేషం. చిన్న సినిమాల ప్రమోషన్ విషయంలో ఆయన అస్సలు వెనకాడటం లేదు. టీజర్లు .. ట్రైలర్లు లాంచ్ చేస్తూ, ఆ సినిమాలు ఎక్కువగా రీచ్ కావడానికి తనవంతు సాయం చేస్తున్నాడు.

అలా ఇప్పుడు ఆయన అలీ నిర్మించిన 'అందరూ బాగుండాలి .. అందులో నేనుండాలి' అనే సినిమా నుంచి మొదటి లిరికల్ వీడియోను రిలీజ్ చేయనున్నాడు. రేపు (శుక్రవారం) సాయంత్రం 4:05 గంటలకు ప్రభాస్ ఈ లిరికల్ వీడియోను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేయనున్నాడు. 'అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్' బ్యానర్ ను ఏర్పాటు చేసి, అలీ నిర్మిస్తున్న మొదటి సినిమా ఇది. ఆయన హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో, సీనియర్ నరేశ్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. హాస్యనటుడిగా రాణించిన అలీ .. నిర్మాతగా ఎంతవరకూ సక్సెస్ అవుతాడో చూడాలి మరి.