రాయలసీమ ఎత్తిపోతల పథకం అక్రమ ప్రాజెక్టే: తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్

24-06-2021 Thu 17:23
  • ఏపీ సర్కారుపై ధ్వజమెత్తిన వేముల
  • నిబంధనలు పాటించడంలేదని ఆరోపణ
  • రాయలసీమ ప్రాజెక్టుతో తెలంగాణ రైతులకు కష్టమని వెల్లడి
  • రోజుకు 7.7 టీఎంసీల నీరు తరలిస్తారని వివరణ
Telangana minister Vemula Prashant terms Rayalaseema irrigation project as illegal

ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదాలు రాజకీయ విమర్శలు, తీవ్ర వ్యాఖ్యలకు దారితీస్తున్నాయి. తాజాగా, తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఏపీ ప్రాజెక్టులు అక్రమం అని ఘోషించారు. ఆయా ప్రాజెక్టులు అక్రమం కాబట్టే కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిర్మాణాలు ఆపేయాలని ఆదేశించిందని స్పష్టం చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిబంధనలు అతిక్రమించి నిర్మిస్తున్నారని ఆరోపించారు.

రాయలసీమ ప్రాజెక్టు సాయంతో రోజుకు 7.7 టీఎంసీల నీటిని తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని, తద్వారా తెలంగాణ ప్రాజెక్టులకు నీరు అందని పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ, పాలమూరు, ఖమ్మం ప్రాంతాల రైతులు తీవ్ర ఇబ్బందుల పాలవుతారని మంత్రి వేముల పేర్కొన్నారు. ఏపీ ఆఖరికి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ)కు కూడా అవాస్తవాలు చెబుతోందని విమర్శించారు.