సురేశ్ ప్రొడక్షన్స్ నుంచి ఇక 'SP మ్యూజిక్'!

24-06-2021 Thu 16:26
  • రామానాయుడు నెలకొల్పిన సురేశ్  ప్రొడక్షన్స్ 
  • 'రాముడు- భీముడు'తో చిత్ర నిర్మాణం మొదలు
  • వివిధ భాషలలో ఇప్పటికి 124 సినిమాలు
  • తాజాగా సంగీత ప్రపంచంలోకి అడుగు  
Suresh Productions into Music world

తెలుగు సినిమా రంగంలో సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థది ఓ విశిష్టాధ్యాయం. ఆ సంస్థ నుంచి ఓ సినిమా వస్తుందంటే ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తారు. అంతటి బ్యానర్ వాల్యూ వుంది. ప్రఖ్యాత నిర్మాత డి.రామానాయుడు 1964లో నెలకొల్పిన సురేశ్ ప్రొడక్షన్స్ తమ తొలి ప్రయత్నంగా ఎన్టీఆర్ తో 'రాముడు-భీముడు' చిత్రాన్ని నిర్మించి ఘన విజయంతో తమ ప్రస్థానానికి శ్రీకారం చుట్టింది.  

అనంతరం ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించి ఎందరో నిర్మాతలకు ఆదర్శంగా నిలిచింది. ఇప్పటికి వివిధ భాషలలో సుమారు 124 సినిమాలు నిర్మించి తనదైన ముద్ర వేసింది.
తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకున్న ఈ సురేశ్ సంస్థ ఇప్పుడు తాజాగా సంగీత ప్రపంచంలోకి కూడా ప్రవేశిస్తోంది.

ఈ విషయాన్ని తెలుపుతూ సంస్థ ఈ రోజు ఓ ప్రకటన చేసింది. 'ఏభై సంవత్సరాల మా సినిమా వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళుతూ.. సురేశ్ ప్రొడక్షన్స్ మ్యూజిక్ పేరిట సంగీత ప్రపంచంలోకి కూడా ప్రవేశిస్తున్నామని తెలియజేయడానికి ఆనందిస్తున్నాం. వినసొంపైన, వీనులవిందైన సంగీతాన్ని అందించడమే మా లక్ష్యం" అంటూ సదరు సంస్థ పేర్కొంది. దీనితో పాటుగా 'సురేశ్ ప్రొడక్షన్స్ మ్యూజిక్'కు సంబంధించిన లోగోను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు.