హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో పీవీ విగ్రహం... ఈ నెల 28న ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్

24-06-2021 Thu 15:59
  • తెలంగాణలో పీవీ శతజయంతి ఉత్సవాలు
  • దివంగత మాజీ ప్రధానికి విశిష్ట గౌరవం
  • 26 అడుగుల ఎత్తుతో భారీ విగ్రహం
  • రూ.27 లక్షల వ్యయంతో విగ్రహం
  • ఇకపై పీవీఎన్ఆర్ మార్గ్ గా నెక్లెస్ రోడ్
CM KCR will unveil PV Narasimharao statue in Hyderabad Necklace Road

దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఖ్యాతిని జాతికి చాటిచెప్పేలా తెలంగాణ సర్కారు శతజయంతి ఉత్సవాలు కొనసాగిస్తుండడం తెలిసిందే. తాజాగా హైదరాబాదు నగరంలోని హుస్సేన్ సాగర్ తీరంలో నెక్లెస్ రోడ్డు వద్ద పీవీ నరసింహారావు విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ నెల 28వ తేదీన పీవీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విగ్రహావిష్కరణ చేయనున్నారు.

ఈ విగ్రహం ఎత్తు 26 అడుగులు కాగా, 2 టన్నుల బరువు ఉంటుంది. దీన్ని రూ.27 లక్షల వ్యయంతో రూపొందించారు. ఈ విగ్రహం తయారీలో పలు లోహాలను ఉపయోగించారు. కాగా, పీవీ విగ్రహం ఏర్పాటు చేస్తున్న నెక్లెస్ రోడ్డు పేరు మార్చారు. ఇకపై నెక్లెస్ రోడ్డును పీవీ నరసింహారావు మార్గ్ గా పిలవనున్నారు. పీవీ విగ్రహం నెలకొల్పే ప్రాంతం చుట్టూ అర ఎకరం మేర అందంగా ముస్తాబు చేయనున్నారు.