పరీక్షలపై సరైన ప్రణాళిక లేని అఫిడవిట్ సమర్పించి చీవాట్లు తిన్నారు: నారా లోకేశ్ విమర్శలు

24-06-2021 Thu 14:34
  • ఏపీలో ఇంటర్ పరీక్షలపై అనిశ్చితి
  • సుప్రీంకోర్టులో సర్కారు అఫిడవిట్ 
  • ఫేక్ సీఎం అంటూ లోకేశ్ వ్యాఖ్యలు
  • మొండిపట్టుదల వద్దని హితవు
  • పరీక్షలు రద్దు చేయాలని మరోసారి డిమాండ్
Nara Lokesh fires in CM Jagan after Supreme Court orders

ఇంటర్ పరీక్షలపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ సమర్పించిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ తీవ్రస్థాయిలో స్పందించారు. ఆఖరికి దేశ అత్యున్నత న్యాయస్థానానికి కూడా ఫేక్ అఫిడవిట్ సమర్పించి ఫేక్ సీఎం అనే పేరును మరోసారి సార్థకం చేసుకున్నారని విమర్శించారు. పరీక్షల నిర్వహణకు సరైన ప్రణాళిక లేని అఫిడవిట్ సమర్పించి చీవాట్లు తిన్నారని అన్నారు.

"మీరు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం పరీక్షల నిర్వహణకు 35 వేల క్లాస్ రూములు ఉండాలి. అన్ని రూములను, సిబ్బందిని సిద్ధం చేశారా?" అని లోకేశ్ ప్రశ్నించారు.

"ప్రాణాల రక్షణకు, పరీక్షల నిర్వహణకు కనీస ఏర్పాట్లు చేయకుండానే మొండిపట్టుదలతో పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఏంటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇది జగన్ మూర్ఖత్వానికి పరాకాష్ఠ. పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడితే పోయే ఒక్కో ప్రాణానికి రూ.1 కోటి ఎక్స్ గ్రేషియా చెల్లించాలని న్యాయస్థానం వ్యాఖ్యానించడం చూస్తుంటే, విద్యార్థుల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదనే విషయం వెల్లడైంది. ఇప్పటికైనా చేసిన తప్పును దిద్దుకుని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రాణాలు బలితీసుకునే పరీక్షల నిర్వహణ ఆలోచనకు స్వస్తి పలకాలి" అంటూ లోకేశ్ డిమాండ్ చేశారు.

తక్షణమే పరీక్షలు రద్దు నిర్ణయం తీసుకుని సుప్రీంకోర్టుకు తెలపాలని స్పష్టం చేశారు. మొండిపట్టుదలకు పోయి మెంటల్ మామగా మిగిలిపోతారో, పరీక్షలు రద్దు చేసి మంచి మామగా ఉంటారో మీ ఇష్టం అని పేర్కొన్నారు.