కడుపు మండి.. ముట్టడిస్తున్నాం: ప్రగతిభవన్​ వద్ద గురుకుల పీఈటీ అభ్యర్థుల ఆందోళన

24-06-2021 Thu 14:22
  • వెంటనే పోస్టింగ్ లివ్వాలని డిమాండ్
  • సీఎం కేసీఆర్ స్పందించాలని విజ్ఞప్తి
  • అరెస్ట్ చేసిన పోలీసులు
Gurukula PET Candidates Agitation At Pragathi Bhavan

తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల పీఈటీ అభ్యర్థులు ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించి, అక్కడ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ముగ్గురు మహిళలు సహా 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని, స్టేషన్ కు తరలించారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్తత నెలకొంది.

గురుకుల పీఈటీ పోస్టుల ఫలితాలను వెంటనే ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఐదేళ్లుగా పోస్టుల కోసం వేచి చూస్తున్నామని, అయినా సర్కార్ లో కదలిక లేదని అన్నారు. తట్టుకోలేక కడుపు మండి ప్రగతి భవన్ ముట్టడికి వచ్చామని అభ్యర్థులు వాపోయారు. 1:1 ప్రకారం అభ్యర్థుల మెరిట్ జాబితాను, ఫలితాలను ప్రకటించి పోస్టింగ్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై ఇప్పటికైనా సీఎం కేసీఆర్ స్పందించాలని వారు కోరారు.