ఇక చాలు.. పడలేకపోతున్నాను: తండ్రి సంరక్షణ చెర నుంచి విడిపించాలని కోర్టుకు మొరపెట్టుకున్న పాప్​ గాయని బ్రిట్నీ స్పియర్స్

24-06-2021 Thu 13:43
  • 13 ఏళ్లు పడింది చాలు
  • నా జీవితం నాకు కావాలి
  • కోర్టుకు భావోద్వేగభరిత సందేశం
I Want My Life Back Britney Spears Urges Judge To End Guardianship

క్రూరమైన తన తండ్రి సంరక్షణ నుంచి తనకు విముక్తి కల్పించాల్సిందిగా ప్రముఖ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ కోర్టును కోరింది. తాజాగా జరిగిన విచారణలో భాగంగా భావోద్వేగానికి లోనైంది. వీడియో లింక్ ద్వారా ఆమె కోర్టు విచారణలో పాల్గొంది. ‘‘13 ఏళ్లుగా పడుతున్నది చాలు. ఇక నా జీవితం నాకు కావాలి’’ అంటూ తన 20 నిమిషాల వీడియోలో పేర్కొంది.

2008లో బ్రిట్నీ తండ్రి జేమీ స్పియర్స్ సంరక్షణ బాధ్యతలను చేపట్టారు. మరింత మంది పిల్లలు కావాలనుకుంటున్న తనను.. తన తండ్రి అడ్డుకుంటున్నాడని వాపోయింది. గర్భనిరోధక ఇంప్లాంట్ తీయనివ్వకుండా అడ్డుపడుతున్నాడని అసహనం వ్యక్తం చేసింది. ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుంటున్నాడని పేర్కొంది. ‘‘అది నన్ను మానసిక వేదనకు గురి చేసింది. కుంగిపోయాను. సంతోషంగా లేను. నిద్రపట్టదు. కోపం వచ్చేస్తోంది’’ అని తన ఆవేదనను వెలిబుచ్చింది.

తన తండ్రి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి తాను ఏడ్వని రోజంటూ లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సంరక్షణ చాలా క్రూరంగా ఉందని ఆరోపించింది. దానిని వెంటనే మార్చాలని, అందుకు అన్ని విధాలా తనకు అర్హత ఉందని ఆమె కోర్టుకు విన్నవించింది. తన తండ్రిని సంరక్షకుడిగా తప్పించాలని కోరుతూ గత ఏడాదే ఆమె కోర్టులో పిటిషన్ వేసింది. ఆస్తులు, ఎస్టేట్ లతో పాటు పూర్తి బాధ్యతలను తానే చూసుకుంటానని ఆమె వివరించింది.