ఈ ఘాతుకానికి పాల్ప‌డ్డారంటే ఎంత‌గా బ‌రితెగించారో అర్థం అవుతోంది: లోకేశ్

24-06-2021 Thu 12:29
  • ప్ర‌శాంత‌ ప‌ల్లెల్ని కూడా ముఠాక‌క్ష‌ల కేంద్రాల్ని చేశారు
  • క‌క్ష‌పూరిత పాల‌న‌లో ఇంకెంత‌మంది కార్య‌క‌ర్త‌ల్ని బ‌లితీసుకుంటారు?
  • కామేపల్లిలో టీడీపీ కార్య‌క‌ర్త లక్కెపోగు సుబ్బారావు హ‌త్య‌
lokesh slams ycp

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై టీడీపీ నేత నారా లోకేశ్ మండిప‌డ్డారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కామేపల్లిలో ఓ  టీడీపీ కార్య‌క‌ర్తను హ‌త్య చేశార‌ని ఆయ‌న చెప్పారు.

'ప్ర‌శాంత‌ ప‌ల్లెల్ని కూడా ముఠాక‌క్ష‌ల కేంద్రాల్ని చేసిన ఫ్యాక్ష‌న్ సీఎం జ‌గ‌న్  గారూ! మీ క‌క్ష‌పూరిత పాల‌న‌లో ఇంకెంత‌మంది టీడీపీ కార్య‌క‌ర్త‌ల్ని బ‌లితీసుకుంటారు? ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కామేపల్లిలో టీడీపీ కార్య‌క‌ర్త లక్కెపోగు సుబ్బారావుని వైసీపీ మూక‌లు హ‌త్య‌చేయ‌డం అత్యంత దారుణం' అని లోకేశ్ ట్వీట్ చేశారు.

'ఇంట్లో శుభ‌కార్యానికి డీజే పెట్టుకుంటే, ఓర్వ‌లేని వైసీపీ వ‌ర్గీయులు దాడి చేసి ఈ ఘాతుకానికి పాల్ప‌డ్డారంటే, ఎంత‌గా బ‌రితెగించారో అర్థం అవుతోంది. సుబ్బారావు కుటుంబానికి, గాయ‌ప‌డిన టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కు పార్టీ అన్నివిధాలుగా అండ‌గా నిలుస్తుంది' అని నారా లోకేశ్ చెప్పారు.