ప్రియమణికి దక్కిన మరో మంచి ఛాన్స్!

24-06-2021 Thu 11:28
  • తెలుగులో బిజీ అవుతున్న ప్రియమణి
  • విడుదలకి సిద్ధంగా రెండు సినిమాలు
  • పట్టాలపైకి వెళ్లనున్న మరో ప్రాజెక్టు
  • కన్నడ సినిమాకి ఇది రీమేక్
Priyamani kannada movie remake

చూస్తుంటే తెలుగులో ప్రియమణి మళ్లీ పుంజుకునేలా కనిపిస్తోంది. తెలుగులో 'విరాటపర్వం' .. 'నారప్ప' సినిమాలు చేసిన ప్రియమణి, తాజాగా మరో సినిమా చేయడానికి అంగీకరించినట్టుగా తెలుస్తోంది. ఇది కన్నడ సినిమాకి రీమేక్ కావడం విశేషం. క్రితం ఏడాది కన్నడలో 'యాక్ట్ 1978' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ .. యజ్ఞ శెట్టి ప్రధానమైన పాత్రను పోషించింది. మన్సో రే దర్శకత్వం వహించిన ఈ సినిమాకి అక్కడ విశేషమైన ఆదరణ లభించింది. ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి.

దాంతో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత ఠాగూర్ మధు ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారు. ప్రియమణి కథానాయికగా ఆయన ఈ సినిమాను నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. గర్భవతి అయిన ఒక మహిళ ప్రభుత్వం నుంచి తనకి రావలసిన నష్టపరిహారం కోసం, ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోతుంది. చివరికి మానవ బాంబుగా మారి ఆఫీసుకు వెళ్లి, ఎవరూ బయటికి వెళ్లకుండా తలుపులు మూసేస్తుంది. ఆ తరువాత ఏం జరిగిందనే మలుపులతో ఈ కథ ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది. ఈ తరహా పాత్రలను ప్రియమణి బాగా చేస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.