తెలంగాణలో టీకా కోసం ఎదురుచూస్తున్న 1.94 కోట్ల మంది

24-06-2021 Thu 09:11
  • రెండు డోసులు తీసుకున్న వారు 14,38,334 మంది
  •  64.48 లక్షల మందికి తొలి డోసు
  • కొవాగ్జిన్‌ కంటే కొవిషీల్డ్ వేయించుకున్న వారే అధికం
about 2 crore people in telangana waiting for vaccination

తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం నత్తనడకన సాగుతోంది. రోజుకు గరిష్ఠంగా 2 లక్షల మందికి కూడా టీకాలు ఇవ్వలేకపోతున్నారు. దీంతో తమ వంతు కోసం రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 1,94,85,855 మంది లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సాగుతున్నట్టే టీకా కార్యక్రమం కొనసాగితే వారందరికీ టీకా తొలి డోసు ఇచ్చేందుకే ఇంకా నాలుగు నెలల సమయం పట్టేలా ఉంది.

ఒకవేళ ఎంత వేగంగా వేసినా అక్టోబరు నాటికి కానీ తొలి డోసు వ్యాక్సినేషన్ పూర్తయ్యే అవకాశం లేదు. ఆ తర్వాత రెండో డోసు వేసేందుకు మరో 12 వారాల సమయం అవసరం అవుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి టీకా కేటాయింపులు పెద్ద ఎత్తున జరిగితే రోజుకు 10 లక్షల మందికి టీకాలు వేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు, రాష్ట్రంలో  ఇప్పటి వరకు 14,38,334 మంది మాత్రమే రెండు డోసులు తీసుకోగా, 64,48,334 మంది ఒక డోసు టీకా వేయించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 93,25,254 డోసులు పంపిణీ చేసినట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో కొవిషీల్డ్ టీకా తీసుకున్న వారు 75,42,129 మంది కాగా, 17,49,980 మంది కొవాగ్జిన్ టీకా వేయించుకున్నారు. స్పుత్నిక్ టీకాను 33,145 మంది తీసుకున్నారు.