కరోనా టీకా తీసుకోండి, లేదంటే పందులకు ఇచ్చే ఔషధం ఇస్తాం: ఫిలిప్పీన్స్ అధ్యక్షుడి హెచ్చరిక

23-06-2021 Wed 22:01
  • కరోనాతో ఇబ్బందుల్లోకి ఫిలిప్పీన్స్‌
  • కట్టడికి అధ్యక్షుడు రోడ్రిగో కఠిన చర్యలు
  • టీకా తీసుకోవాలని ప్రజలకు సూచన
  • లేదంటే అరెస్టు చేస్తామని హెచ్చరిక
Take the coronavaccine otherwise will inject Pigs medicine

టీకా తీసుకోవడానికి నిరాకరిస్తున్న వారికి ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు రోడ్రిగో ఘాటు హెచ్చరికలు జారీ చేశాడు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని ప్రతిఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలని అన్నారు. లేదంటే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. అయినా టీకా వద్దనుకుంటే భారత్‌ లేదా అమెరికాలో ఏదో ఒక చోటికి వెళ్లాలని వ్యాఖ్యానించారు.

తాను తీసుకుంటున్న నిర్ణయం ఎవరికీ నచ్చదని.. కానీ, కరోనా వల్ల ఎమర్జెన్సీ పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో కఠిన నిబంధనలు తప్పవని స్పష్టం చేశారు. టీకా తీసుకోని వారు వైరస్ వ్యాప్తి చేస్తూనే ఉంటారని తెలిపారు. అలాంటి వారి వల్ల దేశానికే ప్రమాదం అన్నారు.

అందువల్లే ప్రతిఒక్కరూ కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవాలని సూచించారు. లేదంటే పందులకు ఇచ్చే ఐవర్‌మెక్టిన్‌ ఔషధం ఇస్తామని హెచ్చరించారు. అప్పుడు వైరస్‌తో పాటు మీరూ చనిపోతారని వ్యాఖ్యానించారు. మహమ్మారి వల్ల గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న ఆగ్నేయాసియా దేశాల్లో ఫిలిప్పీన్స్‌ కూడా ఒకటి కావడం గమనార్హం. బుధవారం అక్కడ 4,353 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఇప్పటి వరకు ఫిలిప్పీన్స్‌లో 1,372,232 కేసులు నిర్ధారణ అయ్యాయి.