దొడ్డి దారిన సంచయితను నియమించారనే విషయం ప్రపంచానికి తెలుసు: వంగలపూడి అనిత

23-06-2021 Wed 21:42
  • వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యలు ఆమె అజ్ఞానానికి నిదర్శనం
  • ఆమె వ్యాఖ్యలు హైకోర్టు తీర్పును ధిక్కరించేలా ఉన్నాయి
  • టీటీడీ ఛైర్మన్ గా మహిళను నియమించాలి
Anitha fires on YSRCP

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. మాన్సాస్ ట్రస్ట్ ఛైర్ పర్సన్ గా సంచయితను దొడ్డి దారిన నియమించారనే విషయం ప్రపంచం మొత్తానికి తెలుసని అన్నారు. మాన్సాస్ ట్రస్ట్ నుంచి సంచయితను తొలగించడాన్ని మహిళా సాధికారతతో ముడిపెట్టడం మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అజ్ఞానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. వాసిరెడ్డి పద్మ చేసిన వ్యాఖ్యలు హైకోర్టు తీర్పును ధిక్కరించేలా ఉన్నాయని అన్నారు.

మహిళల భద్రతకు వైసీపీ ప్రభుత్వం ఎలాంటి ప్రాధాన్యతను ఇస్తోందనే విషయం తాడేపల్లిలో మహిళపై జరిగిన అత్యాచార ఘటనతోనే తేలిపోయిందని అనిత విమర్శించారు. టీటీడీ ఛైర్మన్ పదవిని మహిళకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ పదవిని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లోని ఒక మహిళకు కేటాయించి రాష్ట్ర ప్రభుత్వం గొప్ప మనసును చాటుకోవాలని అన్నారు. వైసీపీ ప్రభుత్వం నిజమైన మహిళా సాధికారతకు కృషి చేయాలని సూచించారు.