సీఎం కావాలనే తొందర లేదు.. పార్టీని అధికారంలోకి తీసుకురావడమే నా లక్ష్యం: డీకే శివకుమార్

23-06-2021 Wed 21:23
  • సీఎం అభ్యర్థిపై తలో ప్రకటన చేస్తున్న కర్ణాటక కాంగ్రెస్ నేతలు
  • ఈ విషయాన్ని సిద్ధరామయ్య చూసుకుంటారన్న శివకుమార్
  • బీజేపీకి వ్యతిరేకంగా అందరూ పోరాటం చేయాలని సూచన
No hurry to become CM says DK Shivakumar

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపై కర్ణాటక కాంగ్రెస్ నేతలు తలో ప్రకటన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక పీసీసీ ప్రెసిడెంట్ డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కావాలనే తొందర తనకు లేదని శివకుమార్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని చెప్పారు. తన సేవలను పార్టీ హైకమాండ్ ఎలా ఉపయోగించుకోవాలన్నా... ఆ బాధ్యతలను నిర్వహించేందుకు తాను సిద్ధమని తెలిపారు.

తమ పార్టీకి చెందిన ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలను తాను చూశానని... అయితే, ఈ విషయాన్ని తమ పార్టీ లెజిస్లేటివ్ నేత సిద్ధరామయ్య చూసుకుంటారని శివకుమార్ చెప్పారు. సిద్ధరామయ్య ఆ పని చేయకపోయినా... రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సజీవంగానే ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఏ సీటు ఖాళీగా లేదని చెప్పారు. పార్టీకి చెందిన నేతలందరూ బీజేపీకి వ్యతిరేకంగా కలసికట్టుగా పోరాటం సాగించి, కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలని సూచించారు.