కేరళను కుదిపేసిన ‘విస్మయ’ మృతి!

23-06-2021 Wed 20:08
  • గత ఏడాది జూన్‌లో వివాహం
  • భారీ మొత్తంలో కట్నం అప్పగింత
  • అయినా, అదనపు కట్నం కోసం వేధింపులు 
  • బాత్రూంలో వేలాడుతూ కనిపించిన విస్మయ
  • హత్యేనని కుటుంబ సభ్యుల ఆరోపణ
Kerala Woman Found Dead who went viral by dowry torture

వరకట్న వేధింపులకు కేరళలో మరో మహిళ బలైంది. ఈ ఘటన కేరళ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. కొల్లాం జిల్లాకు చెందిన విస్మయ ఆయుర్వేదంలో మెడిసిన్‌ కోర్సు చదువుతోంది. గత జూన్‌లో ఆమెకు కిరణ్‌ కుమార్‌ అనే యువకుడితో వివాహమైంది. అయితే, భర్త అదనపు కట్నం కోసం గత కొన్ని రోజులుగా వేధిస్తున్నాడు.

దీంతో వారి పోరు భరించలేక ఆమె తన ఒంటిపై అయిన గాయాలను ఫొటో తీసి వాట్సాప్‌లో తన కుటుంబ సభ్యులకు పంపింది. తనని భర్త కిరణ్‌.. జుట్టు పట్టి రోడ్డుపై ఈడ్చుకెళ్లి కాలితో తొక్కాడని తెలిపింది. ఇది కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం రేపింది. దీంతో రవాణా శాఖలో పనిచేస్తున్న ఆయన్ని ప్రభుత్వం వెంటనే సస్పెండ్‌ చేసింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సైతం స్పందించారు. వరకట్న ఆచారానికి స్వస్తి పలకాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. లేదంటే ఆడబిడ్డలందరినీ మార్కెట్లో సరకులా తయారు చేసినవారమవుతామని వాపోయారు.

ఇదిలా ఉండే.. సోమవారం విస్మయ అత్తారింట్లో బాత్‌రూంలో వేలాడుతూ కనిపించింది. విస్మయది కచ్చితంగా హత్యేనని ఆమె సోదరుడు విజిత్‌ ఆరోపించాడు. కట్నం కోసం ఆమెని వేధించారని.. కొన్నాళ్ల పాటు ఆమె తల్లిదండ్రులతోనే ఉండాల్సి వచ్చిందని తెలిపారు. మరోవైపు ఆమె తండ్రి త్రివిక్రమ్‌ నాయర్ మాట్లాడుతూ.. పెళ్లి సమయంలో 100 నాణేల బంగారం, ఎకరం పొలం, రూ.10 లక్షల విలువ చేసే కారు కట్నంగా ఇచ్చామని తెలిపారు. అయినప్పటికీ అదనపు కట్నం కోసం విస్మయను కిరణ్‌ వేధించాడని తెలిపారు. తమ కళ్ల ముందే విస్మయను కొట్టాడని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో తన కూతురిని అత్తా-మామల ఇంటికి వెళ్లకుండా కూడా ఆపానని త్రివిక్రమ్‌ తెలిపారు. కానీ, కాలేజీకి వెళ్లిన ఆమెను.. భర్త తన పుట్టిన రోజైన మార్చి 17న ఇంటికి తీసుకెళ్లాడన్నారు. దీంతో ఇరు కుటుంబాలు కలిసి రాజీ కుదుర్చుకోవాలనుకున్నామని తెలిపారు. అత్తవారింటికి వెళ్లిన తర్వాత విస్మయ కేవలం తల్లితో మాత్రమే టచ్‌లో ఉందని పోలీసులు తెలిపారు.

కట్నంగా ఇచ్చిన కారు కిరణ్‌కు నచ్చలేదని.. దాని స్థానంలో రూ.10 లక్షల నగదు ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్లు విస్మయ తండ్రి తెలిపారు. కానీ, అది కుదరదని చెప్పడంతో వేధింపులు ప్రారంభమయ్యాయన్నారు. ప్రస్తుతం కిరణ్‌ పోలీసులు కస్టడీలో ఉన్నాడు. ఈ కేసులో ఇంకా ఎవరి హస్తమైనా ఉన్నట్లు తేలితే వారిని అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.