తెలంగాణలో గణనీయంగా తగ్గిన కరోనా మరణాల రేటు.. జాతీయ రేటులో సగం మాత్రమే!

23-06-2021 Wed 19:43
  • గత 24 గంటల్లో 1,114 కేసుల నమోదు
  • 12 మంది మృత్యువాత
  • అత్యల్పంగా ఆదిలాబాద్‌లో రెండు కేసులు వెలుగులోకి
Adilabad records Only 2 corona cases in 24 hours

తెలంగాణలో కరోనా వైరస్ కేసులకు సంబంధించిన తాజా అప్‌డేట్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,114 కరోనా కేసులు వెలుగు చూడగా, 12 మంది మృత్యువాత పడ్డారు. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,16,688కి పెరిగింది. 3,598 మంది మరణించారు. నిన్న ఒక్క రోజే 1280 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. వీరితో కలిపి ఇప్పటి వరకు 5,96,628 మంది ఈ మహమ్మారి కోరల నుంచి బయటపడ్డారు.

దేశవ్యాప్తంగా కరోనా మరణాల రేటు 1.3 శాతంగా ఉండగా, తెలంగాణలో ఇది 0.58 శాతంగా ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది. రికవరీ రేటు కూడా మెరుగ్గానే ఉంది. దేశంలో ఇది 96.52 శాతంగా ఉండగా, తెలంగాణలో 96.74 శాతంగా ఉంది. రాష్ట్రంలో ఇంకా 16,462 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక నిన్న ఒక్క రోజే 1,18,109 పరీక్షలు నిర్వహించినట్టు ప్రభుత్వం వివరించింది. జీహెచ్ఎంసీ పరిధిలో నిన్న 129 కేసులు మాత్రమే వెలుగుచూడగా, అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి.