భారతీయ సంస్కృతిని నస్రత్ జహాన్ అవమానించారు.. రాజీనామా చేయాల్సిందే: బీజేపీ డిమాండ్

23-06-2021 Wed 19:04
  • ఆమె రాజీనామా చేయకుంటే పదవి నుంచి తొలగించాలి
  • వివాహ విందుకు సీఎం మమతను కూడా ఆహ్వానించారు
  • ఎంపీ పదవికి అనర్హురాలిగా ప్రకటించాలంటూ స్పీకర్‌కు బీజేపీ ఎంపీ లేఖ
Nusrat Jahan should resign or TMC should sack her says Dilip Ghosh

భారతీయ సంస్కృతిని అవమానించిన టీఎంసీ ఎంపీ నస్రత్ జహాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ డిమాండ్ చేశారు. నుదుట సిందూరం పెట్టుకున్న నస్రత్ ఓ వ్యక్తిని వివాహం చేసుకుని తన భర్తగా పేర్కొంటూ వివాహ విందు ఏర్పాటు చేశారని, దానికి సీఎం మమతను కూడా ఆహ్వానించారని గుర్తు చేశారు. ఇప్పుడేమో అతడితో తనకు పెళ్లే జరగలేదని చెబుతున్నారని, ఇది భారతీయ సంస్కృతిని అవమానించడమేనని అన్నారు. ఆమె కనుక తన పదవికి రాజీనామా చేయకుంటే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

మరోపక్క, నస్రత్ జహాన్ తన వైవాహిక హోదా గురించి పార్లమెంటుకు తప్పుడు ప్రమాణ పత్రాన్ని ఇచ్చారని, ఆమెను ఎంపీ పదవికి అనర్హురాలిగా ప్రకటించాలని కోరుతూ యూపీ బీజేపీ ఎంపీ సంఘమిత్ర మౌర్య నిన్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. వ్యాపారవేత్త నిఖిల్ జైన్‌ను టర్కీలో వివాహం చేసుకున్నట్టు గతంలో  ప్రకటించిన నస్రత్.. ఇటీవల తమ బంధం దెబ్బతిన్నట్టు ప్రకటించినప్పటి నుంచి రాజకీయంగా వివాదం చుట్టుముట్టింది.