దేశం గర్వించదగ్గ ఛాంపియన్లను అందించాలి.. కరణం మల్లీశ్వరిని అభినందించిన పవన్‌ కల్యాణ్‌

23-06-2021 Wed 19:03
  • ఢిల్లీ క్రీడా వర్సిటీ తొలి వీసీగా మల్లీశ్వరి
  • తెలుగుతేజం  బాధ్యతలు చేపట్టనుండడంపై పవన్‌ హర్షం
  • వీసీగా మార్గదర్శకంగా నిలుస్తారని విశ్వాసం
  • గ్రామీణ క్రీడాకారులకు సానపట్టాలని హితవు
  • కేజ్రీవాల్‌ను కలిసిన మల్లీశ్వరి
Pawan kalyan congratulated karanam mallishwari

ఢిల్లీ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌గా నియమితులైన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ క్రీడాకారిణి కరణం మల్లీశ్వరిని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అభినందించారు. తెలుగుతేజం ఓ ప్రఖ్యాత వర్సిటీ వీసీగా నియమితులవడం గర్వంగా ఉందన్నారు. దేశంలో క్రీడారంగం అభ్యున్నతికి దోహదపడే విశ్వవిద్యాలయానికి తొలి వీసీగా తెలుగు తేజం బాధ్యతలు చేపట్టనుండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అందుకు జనసేన పార్టీ తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నామన్నారు.

శ్రీకాకుళం జిల్లా నుంచి సిడ్నీ ఒలింపిక్స్ వరకు మల్లీశ్వరి సాగించిన ప్రస్థానం ఎంతో విలువైందని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఒలింపిక్స్‌ పతకం సాధించి ఎంతో మంది యువతులకు ఆదర్శంగా నిలిచారన్నారు. అదే విధంగా ఇప్పుడు చేపట్టనున్న బాధ్యతల్లోనూ ఆమె అందరికీ మార్గదర్శకంగా నిలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆమె నేతృత్వంలో క్రీడా విశ్వవిద్యాలయాల ద్వారా దేశం గర్వించదగ్గ ఛాంపియన్లను అందించాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్న ఆణిముత్యాల్లాంటి క్రీడాకారులకు సానపట్టాలని కోరారు.
మరోవైపు మల్లీశ్వరి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను కలిశారు. ఆమెతో పలు అంశాలపై చర్చించినట్లు కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు. సమావేశంలో డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా కూడా పాల్గొన్నారు.