మెగాస్టార్ సరసన మెరవనున్న సోనాక్షి సిన్హా?

23-06-2021 Wed 19:01
  • ఈ ఏడాదిలో 'ఆచార్య' విడుదల
  • పట్టాలెక్కనున్న 'లూసిఫర్' రీమేక్
  • లైన్లోనే ఉన్న 'వేదాళం' రీమేక్
  • తన ప్రాజెక్టు పనుల్లో బాబీ    
Sonakshi Sinha with Megastar

చిరంజీవి సరసన బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా మెరవనుందనే టాక్ ఇప్పుడు జోరుగా వినిపిస్తోంది. దాంతో ఏ సినిమాలో? .. ఎప్పుడు? అనే ప్రశ్నలు తలెత్తడం సహజం. చిరంజీవి కథానాయకుడిగా బాబీ ఒక సినిమాను రూపొందించనున్న సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో చిరంజీవి సరసన నాయికగా సోనాక్షి అయితే బాగుంటుందని భావించిన బాబీ, ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నాడని అంటున్నారు. దాదాపు ఆమెనే ఖరారు కావొచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం చిరంజీవి 'ఆచార్య' సినిమా చేస్తున్నారు. వచ్చేనెలతో ఈ సినిమా షూటింగు పూర్తి కానుంది. ఆ తరువాత ప్రాజెక్టుగా మలయాళ మూవీ 'లూసిఫర్' రీమేక్ పట్టాలెక్కుతుంది. ఈ సినిమా వెంటనే తమిళ హిట్ మూవీ 'వేదాళం' రీమేక్ సెట్స్ పైకి వెళుతుంది. ఆ తరువాత సినిమాను బాబీ దర్శకత్వంలో చిరంజీవి చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా చెప్పారు కూడా. ఈ సినిమా కోసమే సోనాక్షిని తీసుకోనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.