మూడోసారి భేటీ అయిన శరద్ పవార్, పీకే.. ఆంతర్యం తెలియక ఊహాగానాలు

23-06-2021 Wed 16:55
  • మూడోసారి భేటీ అయిన పీకే, పవార్
  • రాజకీయంగా జోరుగా ఊహాగానాలు
  • వెల్లడి కాని సమావేశ వివరాలు
Prashant Kishor Once again meets Sharad Pawar

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఢిల్లీలో నేడు ఎన్సీపీ చీఫ్ శరద్ పవర్‌ను కలుసుకున్నారు. ఇటీవల ముంబైలో ఇద్దరి మధ్య జరిగిన సమావేశం రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీయగా, మొన్న కూడా వీరిద్దరూ ఢిల్లీలో కలుసుకున్నారు. ఇక నేడు మూడోసారి వీరిద్దరూ కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. పవార్ సారథ్యంలో ఎనిమిది పార్టీల నేతలు నిన్న ఢిల్లీలోని పవార్ నివాసంలో సమావేశమయ్యారు. ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చి థర్డ్ ఫ్రంట్‌గా ఏకీకరణ చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగినట్టు వార్తలు వస్తున్నప్పటికీ అది నిజం కాదన్న వాదన కూడా ఉంది.

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల తరపున పవార్‌ను బరిలోకి దింపడమే ఈ సమావేశం లక్ష్యమని తెలుస్తోంది. థర్డ్‌ఫ్రంట్, ఫోర్త్ ఫ్రంట్‌లు ఎన్డీయేకు పోటీ ఇవ్వలేవన్న ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలు ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. అయితే, పవార్, పీకే మధ్య జరుగుతున్న చర్చలకు సంబంధించిన వివరాలు మాత్రం బయటకు వెల్లడి కాకపోవడం గమనార్హం. దీంతో వీరి మధ్య ఏ అంశంపై చర్చలు జరుగుతున్నాయన్న దానిపై ఊహాగానాలు జోరందుకున్నాయి.