బ్యాంకుల చేతికి మాల్యా, నీరవ్ మోదీ, చోక్సీల ఆస్తులు

23-06-2021 Wed 16:33
  • రూ. 18,170.02 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ
  • రూ. 9,371 కోట్ల విలువైన ఆస్తులు బ్యాంకులకు బదిలీ
  • ముగ్గురినీ భారత్ కు రప్పించేందుకు యత్నిస్తున్న భారత్
Banks Get Part Of Vijay Mallya and Nirav Modi and Mehul Choksis Assets

బ్యాంకులకు శఠగోపం పెట్టి విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురికి సంబంధించిన రూ. 18,170.02 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇందులో రూ. 969 కోట్ల విలువైన ఆస్తులు విదేశాల్లో ఉన్నాయి. బ్యాంకులకు వీరు చెల్లించాల్సిన బకాయిల్లో ఈ ఆస్తుల విలువ దాదాపుగా 80.45% ఉంటుంది.

ఇక ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల్లో రూ. 9,371 కోట్ల విలువైన ఆస్తులను రుణాలు ఇచ్చిన బ్యాంకులకు బదిలీ చేశారు. ముంబైలోని పీఎంఎల్ఏ స్పెషల్ కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆస్తులను బదిలీ చేశారు. ఆస్తుల బదిలీ వల్ల బ్యాంకులకు సగం మేర రుణాలను రాబట్టుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు ఈ ముగ్గురినీ స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది.