పాక్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ ఇంటి వద్ద భారీ పేలుడు

23-06-2021 Wed 16:09
  • లాహోర్ లోని సయీద్ ఇంటి వద్ద పేలుడు
  • ముగ్గురి మృతి.. 20 మందికి పైగా గాయాలు
  • పోలీసుల అదుపులో పేలుడు జరిగిన ప్రాంతం
Blast Outside Hafiz Saeeds House In Lahore

ముంబై బాంబు పేలుళ్ల మాస్టర్ మైండ్, జమాత్ ఉద్దవా చీఫ్ హఫీజ్ సయీద్ ఇంటి వద్ద ఈరోజు భారీ పేలుడు సంభవించింది. పాకిస్థాన్ లోని లాహోర్ లోని ఆయన ఇంటి వద్ద చోటు చేసుకున్న పేలుడులో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలవగా, 20 మందికి పైగా గాయపడ్డారు. సయీద్ నివాసం వద్ద ఉన్న పోలీస్ పికెట్ వద్ద ఈ పేలుళ్లు జరిగాయి. పోలీస్ పికెట్ లేకపోతే నష్టం మరింత ఎక్కువగా ఉండేదని పంజాబ్ (పాకిస్థాన్) పోలీస్ చీఫ్ ఇనామ్ ఘనీ తెలిపారు. సయీద్ ను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. పేలుడుకు కారణం తెలిసేంత వరకు ఎవరు ఎవరిని టార్గెట్ చేశారో చెప్పలేమని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. మరోవైపు ఘటన జరిగిన వెంటనే అక్కడకు బాంబు స్కాడ్లు చేరుకుని సహాయక కార్యక్రమాలను చేపట్టాయి. గాయపడిని వారిని ప్రైవేటు కార్లు, ఆటోల్లో లాహార్ లోని జిన్నా ఆసుపత్రికి తరలించారు. ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పిన కథనం ప్రకారం... గుర్తు తెలియని వ్యక్తి వదిలి వెళ్లిన మోటారు సైకిలు కాసేపటి తర్వాత పేలిపోయింది. ఈ పేలుడు ధాటికి చుట్టుపక్కల ఇళ్ల కిటీకీల అద్దాలు పగిలిపోయాయని, కొన్ని భవంతులు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం ఆ ప్రాంతం మొత్తాన్ని పోలీసులు తమ స్వాధీనంలోకి తీసుకున్నారు.