కిలో రూ.50.. మొత్తం రూ.3,600.. స్వహస్తాలతో పండ్లు అమ్మిన నరేశ్​!

23-06-2021 Wed 14:39
  • ఫాంహౌస్ లో స్వయంగా పండ్లు తెంపిన వైనం
  • వ్యవసాయంలోనే అసలు మజా ఉందని కామెంట్
  • మామిడి, నేరేడు పండ్లు ఆఫీసులో అమ్మకం
Actor Naresh Sells Fruits and Earns Money from His Farm House

సినీ నటుడు నరేశ్ తన ఫాంహౌస్ తోటలో పండించిన పండ్లను స్వయంగా అమ్మారు. లాక్ డౌన్ సమయంలో వ్యవసాయంతో కాస్తంత టైంపాస్ చేసిన అతడు.. ఇప్పుడు ఫాంహౌస్ లో తన చెట్లకు కాసిన పండ్లను తానే స్వయంగా తెంపారు. మామిడి పండ్లు, నేరేడు పండ్లను ఆఫీసుకు తీసుకొచ్చి స్వయంగా అమ్మారు. కిలో రూ.50 చొప్పున మొత్తం రూ.3,600 సంపాదించాడు. తన పండ్ల అమ్మకం గురించి ఆయన ట్విట్టర్ లో స్పందించారు.

సినీ నటుడిగా అత్యధిక పారితోషికం తీసుకున్నప్పుడు కలిగిన ఆనందం కన్నా.. ఇప్పుడు స్వయంగా వ్యవసాయం చేసి సంపాదించిన దాంతోనే ఎక్కువ ఆనందంగా ఉందని ట్వీట్ చేశారు. వ్యవసాయం చేయడంలోనే అసలైన మజా ఉందన్నారు. సేంద్రియ పద్ధతిలో తన ఫాంహౌస్ లో పండించిన మామిడి, నేరేడు పండ్లను తానే స్వయంగా తెంపానని, కిలో రూ.50కి అమ్మానని నరేశ్ చెప్పారు. ట్విట్టర్ లో ఆయన పెట్టిన ఫొటోలు వైరల్ అయ్యాయి. ప్రస్తుతం అలీతో కలిసి ‘అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి’ అనే సినిమాలో ఆయన నటిస్తున్నారు.