V Prashanth Reddy: ఆంధ్ర‌ ప్రజలను నేను అలా అన‌లేదు.. ఆంధ్ర‌ పాల‌కుల‌ను ఉద్దేశించే అన్నాను: తెలంగాణ‌ మంత్రి ప్ర‌శాంత్‌రెడ్డి

  • ఏడేళ్లుగా తెలుగు ప్ర‌జ‌ల మ‌ధ్య  సోద‌ర‌భావం
  • తెలుగు ప్ర‌జ‌లంతా బాగుప‌డాల‌న్న‌దే కేసీఆర్ ఆకాంక్ష‌
  • ఏపీ అక్ర‌మ ప్రాజెక్టుల వ‌ల్ల తెలంగాణ న‌ష్ట‌పోతుంద‌నేది మా బాధ‌
  • తెలంగాణ నీళ్ల‌ను ఆయ‌న ఆంధ్రాకు త‌ర‌లించుకుపోలేదా?
prashant reddy on his comment about ap

ఆంధ్ర‌ప్ర‌దేశ్ క‌డుతోన్న నీటి ప్రాజెక్టుల‌పై తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతోన్న విష‌యం తెలిసిందే. ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై ఏపీ నేత‌లు కూడా తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. తెలుగు వారంతా ఒక్కటేనని ప్రశాంత్‌రెడ్డి గుర్తించాలని ఏపీ ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యే రోజా, ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి హితవు పలికారు. ఏపీ ప్రజలను రాక్షసులంటూ మాట్లాడటం దారుణం అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వీట‌న్నింటిపై ప్ర‌శాంత్ రెడ్డి వివ‌ర‌ణ ఇచ్చారు.

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో నిన్న తాను చేసిన ఆ వ్యాఖ్య‌లు ఆంధ్ర ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన‌వి కాదని, ఆంధ్ర‌పాల‌కుల‌ను ఉద్దేశించి మాత్ర‌మే మాట్లాడానని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఏడేళ్లుగా తెలుగు ప్ర‌జ‌ల మ‌ధ్య సోద‌ర‌భావం ఉంద‌ని చెప్పుకొచ్చారు. తెలుగు ప్ర‌జ‌లంతా బాగుప‌డాల‌న్న‌దే కేసీఆర్ ఆకాంక్ష అని, ఏపీ అక్ర‌మ ప్రాజెక్టుల వ‌ల్ల తెలంగాణ న‌ష్ట‌పోతుంద‌నేదే త‌మ‌ బాధ అని చెప్పారు.

తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్ర ఏర్పాటుకు వైఎస్సార్ అడ్డుప‌డ‌లేదా? అని ప్ర‌శాంత్ రెడ్డి నిల‌దీశారు. తెలంగాణ నీళ్ల‌ను ఆయ‌న ఆంధ్రాకు త‌ర‌లించుకుపోలేదా? అని ప్ర‌శ్నించారు. ఇప్పుడు వైఎస్సార్‌ను మించి ఏపీ సీఎం జ‌గ‌న్ జ‌గ‌న్ ఎక్కువ నీరు త‌ర‌లిస్తున్నార‌ని మ‌రోసారి విరుచుకుప‌డ్డారు.

కృష్ణాపై ఏపీ ప్రభుత్వం కడుతున్న అక్రమ ప్రాజెక్టుల వల్ల తెలంగాణ‌ రాష్ట్ర రైతులు నష్టపోతారని ప్రశాంత్ రెడ్డి చెప్పారు. అలాగే, నీటివాట తేల్చకుండా జాప్యం చేస్తున్న కేంద్ర స‌ర్కారు తీరు స‌రికాద‌న్నారు. అక్రమ ప్రాజెక్టులు కడుతున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వ తీరు ప‌ట్ల తాము నిరసన తెలుపుతామ‌ని అన్నారు.

More Telugu News