నయనతారను ఎదుర్కునే విలన్ గా సుదీప్!

23-06-2021 Wed 11:20
  • వరుస సినిమాలతో నయన్ బిజీ
  • తాజా చిత్రంగా రానున్న 'నేత్రికన్'
  • విలన్ పాత్రలో సుదీప్
  • త్వరలోనే రెగ్యులర్ షూటింగ్
Sudeep plays villain role in Nayanatara movie

నయనతార అభిమానులంతా ఇప్పుడు 'నేత్రికన్' సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ఆమె ఒక అంధురాలిగా నటించింది. ఒక సీరియల్ కిల్లర్ బారి నుంచి తప్పించుకోవడమే కాకుండా, అతనిని పట్టించే పాత్రలో ఆమె నటన చూసి తీరవలసిందేనని అంటున్నారు. ఇక ఆ తరువాత కూడా ఆమె సినిమాలు కొన్ని లైన్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమె మరో సినిమా చేయడానికి అంగీకరించింది. ఇది కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమానే. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని అంటున్నారు.

ఒక నూతన దర్శకుడు వినిపించిన ఈ కథ నచ్చడంతో నయనతార వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. డ్రీమ్ వారియర్స్ వారు ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందట. ఈ పాత్ర కోసం సుదీప్ ను ఎంపిక చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. కన్నడలో సుదీప్ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. తెలుగు .. తమిళ భాషల్లోను ఆయనకి మంచి క్రేజ్ ఉంది. అందువలన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండే అవకాశం ఉంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా చెబుతున్నారు.