జగన్‌ పై పాత కేసుల ఉపసంహరణను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు

23-06-2021 Wed 08:12
  • ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 11 క్రిమినల్ కేసుల నమోదు
  • నిబంధనలకు విరుద్ధంగా కేసుల ఉపసంహరణ
  • నేడు హైకోర్టులో విచారణకు రానున్న కేసు
  • ప్రతివాదులుగా జగన్, ప్రభుత్వం, పబ్లిక్ ప్రాసిక్యూటర్
High Court accepts withdrawal of old cases against as suo motu

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నమోదైన 11 క్రిమినల్ కేసులను నిబంధనలకు విరుద్ధంగా ఉపసంహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు, ఫిర్యాదుదారులు కలిసి నిబంధనలను ఉల్లంఘించి కేసులను ఉపసంహరించడాన్ని హైకోర్టు సుమోటోగా స్వీకరించింది.

ఈ 11 కేసుల్లో అనంతపురం జిల్లాకు సంబంధించినవి ఐదు కాగా, గుంటూరులో నమోదైనవి ఆరు కేసులు ఉన్నాయి. కరోనా సమయంలో పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, సంబంధిత న్యాయాధికారులు కలిసి నిబంధనలకు విరుద్ధంగా ఈ కేసులను హడావుడిగా ఉపసంహరించారన్న ఆరోపణలు ఉన్నాయి.

ఈ కేసులకు సంబంధించిన వివరాలు కోర్టు దృష్టికి రావడంతో హైకోర్టు పరిపాలన విభాగం వీటిని పరిశీలించి సుమోటోగా విచారణకు తీసుకుని హైకోర్టు రిజిస్ట్రీకి నంబర్లు కేటాయించింది. ఈ క్రిమినల్ రివిజన్ పిటిషన్లు నేడు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లలిత ముందుకు విచారణకు రానున్నాయి. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం, పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఫిర్యాదుదారులు, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతివాదులుగా ఉన్నారు.