వెంటనే ఇన్ కమ్ టాక్స్ వెబ్‌సైట్‌లోని సమస్యల్ని పరిష్కరించండి.. ఇన్ఫోసిస్‌ను ఆదేశించిన నిర్మలా సీతారామన్‌

22-06-2021 Tue 21:31
  • ఐటీ రిటర్నుల దాఖలు ప్రక్రియను సులభం చేసేందుకు కొత్త సైట్‌
  • అభివృద్ధి చేసిన ఇన్ఫోసిస్‌
  • కొత్త సైట్‌లో సాంకేతిక సమస్యలు
  • వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు
  • నేడు ఇన్ఫీ అధికారులతో భేటీ అయిన మంత్రి
  • పరిష్కరిస్తామన్న ఇన్ఫీ అధికారులు
sitaraman expressed disappointment with infy offcers over new IT portal problems

ఆదాయపు పన్ను రిటర్నుల సమర్పణ ప్రక్రియను మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా కేంద్ర ఆర్ధిక శాఖ కొత్త వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే, పోర్టల్‌లో అనేక ఇబ్బందులు తలెత్తుతుండడంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సైట్‌ను అభివృద్ధి చేసిన ఇన్ఫోసిస్‌ అధికారులతో ఆమె నేడు భేటీ అయ్యారు.

ఇన్ఫోసిస్‌ తరఫున సంస్థ సీఈఓ సలీల్‌ పరేఖ్‌, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రవీణ్‌ రావు సమావేశానికి హాజరయ్యారు. సమస్యలను తొలగించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన కొత్త వెబ్‌సైట్‌ వల్ల ఇబ్బందులు తలెత్తడంపై సీతారామన్‌ వారితో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏమాత్రం సమయం వృథా చేయకుండా వెంటనే వెబ్‌సైట్‌లోని సమస్యల్ని పరిష్కరించాలని ఆదేశించారు. దీనివల్ల పన్ను చెల్లింపుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వీలైనంత త్వరగా వారి సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు.

ఇక సైట్‌లోని సాంకేతిక సమస్యల్ని ప్రస్తావించిన ఇన్ఫోసిస్‌ అధికారులు వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యల్ని సీతారామన్‌కు వివరించారు. ఇప్పటికే కొన్ని సమస్యల్ని గుర్తించి పరిష్కరించామని తెలిపారు.