Raghu Rama Krishna Raju: శాసనమండలి రద్దు చేయాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయానికి సహకరించండి: కేంద్రమంత్రికి లేఖ రాసిన రఘురామ

  • గతంలో మండలి రద్దుకు సీఎం జగన్ నిర్ణయం
  • తీర్మానానికి ఆమోదం తెలిపిన అసెంబ్లీ
  • తీర్మానం పార్లమెంటు వద్ద పెండింగ్ లో ఉందన్న రఘురామ
  • వర్షాకాల సమావేశాల్లో చర్చించాలని విజ్ఞప్తి
Raghurama wrote Union Govt over AP Legislative Council dissolution

గతంలో ఏపీ శాసనమండలిని రద్దు చేయాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయానికి సహకరించాలంటూ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తాజాగా లేఖ రాశారు. శాసనమండలిని రద్దు చేయాలంటూ 2020 జనవరి 27న అసెంబ్లీలో ఏపీ సర్కారు ఓ తీర్మానం చేసిందని రఘురామ కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

నిరుపయోగం, ధన భారం అని నాడు సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. నాడు ఏపీ అసెంబ్లీ ఈ తీర్మానాన్ని ఆమోదించిన పిమ్మట అది పార్లమెంటుకు చేరిందని, దానిపై పార్లమెంటు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. ఓ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై నిర్ణయం తీసుకునే అధికారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 169(1) ప్రకారం పార్లమెంటుకు ఉందని రఘురామ తన లేఖలో వివరించారు. ఆ మేరకు ఓ రాష్ట్రంలో మండలి ఏర్పాటుకైనా, రద్దుకైనా పార్లమెంటు నిర్ణయం తీసుకోవచ్చని తెలిపారు.

"వైసీపీ ఎంపీగా ఉన్న నేను ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నా. గత ఏడాదిన్నర కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ తీర్మానాన్ని పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో చర్చకు తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. తద్వారా డబ్బును ఆదా చేయాలన్న మా ప్రియతమ ముఖ్యమంత్రి ఆకాంక్షను నెరవేర్చేలా చూడండి" అంటూ రఘురామ తనదైన శైలిలో లేఖను ముగించారు.

ఇటీవల ఏపీ శాసనమండలిలో టీడీపీ సభ్యుల బలం తగ్గగా, వైసీపీ సభ్యుల బలం 20కి పెరిగింది. గవర్నర్ కోటాలో ఇటీవలే నలుగురు వైసీపీ సభ్యులు ఎమ్మెల్సీలు అయ్యారు. దాంతో ఇకపై అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాలను మండలిలో టీడీపీ అడ్డుకునే వీల్లేదు. తనకున్న బలంతో వైసీపీ మండలిలోనూ తీర్మానాలు ఆమోదింపచేసుకోవచ్చు.  

More Telugu News