బీజేపీలో చేరడం మా తప్పు.. గంగాజలంతో శుద్ధి చేసుకున్న తృణమూల్‌ కార్యకర్తలు

22-06-2021 Tue 20:41
  • గుండ్లు గీయించుకున్న కొంతమంది కార్యకర్తలు
  • పాపపరిహారం కోసమేనని వ్యాఖ్య
  • అనంతరం ఎంపీ పొద్దార్‌ను కలిసిన కార్యకర్తలు
  • అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలోకి చేరికలు
  • తిరిగి తృణమూల్‌లో చేరుతున్న వైనం
tmc workers rejoined in party after leaving BJP by sprinkling gangajal on head to atone

ఈ మధ్య దేశ దృష్టిని ఆకర్షిస్తున్న పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో ఈరోజు ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అనేక మంది నేతలు సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ను వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.

అయితే, వారంతా ఎన్నికలు ముగిసిన తర్వాత తిరిగి సొంత గూటికి చేరుతున్నారు. అందులో భాగంగా నేడు హుగ్లీ జిల్లాలో దాదాపు 200 మంది కార్యకర్తలు తిరిగి తృణమూల్‌లో చేరారు. అయితే, తమను తాము శుద్ధి చేసుకుంటున్నట్లు చెప్పిన వారంతా.. గుండ్లు గీయించుకొని శరీరంపై గంగా జలాన్ని చల్లుకున్నారు.

బీజేపీలో చేరడం పెద్ద తప్పని.. అందుకు పాపపరిహారంగా గంగాజలాన్ని చల్లుకొని తిరిగి తృణమూల్‌లో చేరుతున్నామని కార్యకర్తలు అభిప్రాయపడ్డారు. అనంతరం ఆరంబాగ్‌ ఎంపీ అపరూప పొద్దార్‌ని కలిశారు.  ఆరంబాగ్‌లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా.. పలువురు కార్యకర్తలు అక్కడి వచ్చి తాము తిరిగి తృణమూల్‌ చేరతామని చెప్పినట్లు ఎంపీ తెలిపారు.