రహస్యంగా ఓ బిడ్డకు జన్మనిచ్చిందన్న వార్తలపై అవికా గోర్ స్పందన

22-06-2021 Tue 17:59
  • బిడ్డకు జన్మనిచ్చాననే వార్తల్లో నిజం లేదు
  • రెండేళ్లుగా మిలింద్ చంద్వాణీతో డేటింగ్ లో ఉన్నా
  • తనలో మార్పు రావడానికి మిలిందే కారణమన్న అవిక 
Avika Gor is dating with Milind Chandwani

'ఉయ్యాల జంపాల' సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఉత్తరాది భామ అవికా గోర్ ఇటీవలి కాలంలో పతాక శీర్షికల్లో నిలుస్తోంది. ఆమె ఓ బిడ్డకు రహస్యంగా జన్మనిచ్చిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఒకానొక సమయంలో బొద్దుగా మారిపోయిన అవికా సినీ అవకాశాలను కోల్పోయింది. ఇప్పుడు మళ్లీ నాజూకుగా తయారయింది.

ఈ నేపథ్యంలో ఓ జాతీయ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అవికా స్పందిస్తూ... తాను మళ్లీ మనిషిగా మారడానికి తన ప్రియుడు మిలింద్ చంద్వాణీనే  కారణమని చెప్పింది. గత రెండేళ్లుగా అతనితో డేటింగ్ చేస్తున్నానని తెలిపింది. తనను తాను అర్థం చేసుకోవడానికి మిలింద్ ఎంతో సహకరించాడని చెప్పింది. శారీరకంగా, మానసికంగా తనలో మార్పు రావడానికి మిలిందే కారణమని తెలిపింది. కష్ట సమయంలో మిలింద్ వంటి తోడు దొరకడం తన అదృష్టమని చెప్పింది.

ఇక సహనటుడు మనీశ్ రాయ్ తో ఓ బిడ్డకు జన్మనిచ్చాననే వార్తల్లో నిజం లేదని అవికా తెలిపింది. మనీశ్ తనకంటే ఎనిమిదేళ్లు పెద్దవాడని చెప్పింది. తన జీవితంలో అతనికి ఒక ప్రత్యేక స్థానం ఉందని తెలిపింది. ప్రస్తుతం రెండు చిత్రాల్లో అవికా నటిస్తోంది. మరో సినిమాకు ఆమె నిర్మాతగా వ్యవహరిస్తోంది.