ఇమ్రాన్ ఖాన్ సెక్సిస్ట్ వ్యాఖ్యలపై మండిపడ్డ తస్లిమా నస్రీన్

22-06-2021 Tue 16:52
  • మహిళల దుస్తుల ప్రభావం పురుషులపై ఉంటుందన్న ఇమ్రాన్
  • పురుషుల దుస్తుల ప్రభావం కూడా మహిళలపై ఉంటుందన్న తస్లిమా
  • ఇమ్రాన్ అర్ధనగ్న ఫొటోను షేర్ చేసిన తస్లిమా
Author Taslima Nasreen criticises Imran Khans Sexist Remark

తాజాగ్ ఓ వెబ్ న్యూస్ సంస్థకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇచ్చిన ఇంటర్వ్యూ దుమారం రేపుతోంది. ఎవరైనా మహిళ తక్కువ దుస్తులు ధరిస్తే, పురుషులు రోబోలు కాని పక్షంలో, సదరు మహిళ ధరించిన దుస్తుల ప్రభావం పురుషులపై ఉంటుందని ఆయన అన్నారు. ఇది అందరికీ అర్థమయ్యే విషయమేనని చెప్పారు. పాకిస్థాన్ లో ఒక ప్రత్యేక తరహా సమాజం ఉందన్నారు. పాక్ ప్రజల జీవన విధానం ప్రత్యేకమైనదని చెప్పారు. సమాజంలోని టెంప్టేషన్ ను ఓ స్థాయికి పెంచితే... ఇక చిన్న పిల్లలు వెళ్లడానికి ఏ దారి ఉంటుందని ప్రశ్నించారు.

ఇమ్రాన్ వ్యాఖ్యలపై ప్రముఖ రచయిత్రి తస్లిమా నస్రీన్ మండిపడ్డారు. ఓ మగాడు తక్కువ దుస్తులు ధరిస్తే, మహిళలు రోబోలు కాని పక్షంలో, ఆ మగాడు ధరించిన దుస్తుల ప్రభావం కచ్చితంగా మహిళలపై ఉంటుందని అన్నారు. అంతేకాదు ఇమ్రాన్ ఖాన్ అర్దనగ్నంగా ఉన్న ఒక ఫొటోను కూడా తన ట్వీట్ తో పాటు జత చేశారు.

మరోవైపు ఇమ్రాన్ వ్యాఖ్యలపై ముస్లిం లీగ్ అధికార ప్రతినిధి మరియం నవాజ్ కూడా ఇమ్రాన్ పై మండిపడ్డారు. ఇమ్రాన్ అసలు స్వభావం బయటపడిందని విమర్శించారు.