బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి 21వ వార్షికోత్సవానికి హాజరైన బాలకృష్ణ

22-06-2021 Tue 16:13
  • సోషల్ మీడియాలో వివరాలు తెలిపిన బాలయ్య
  • ఎంతో సంతోషంగా ఉందని వ్యాఖ్యలు
  • అత్యుత్తమ ఆసుపత్రుల్లో ఇదొకటని వెల్లడి
  • కరోనా వేళ కూడా సేవలు అందిస్తున్నట్టు ఉద్ఘాటన
Balakrishna attends Basavatarakam Cancer Hospital foundation day celebrations

హైదరాబాదులోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్-రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఇవాళ 21వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. ఈ కార్యక్రమానికి బసవతారకం ఆసుపత్రి మేనేజింగ్ ట్రస్టీ నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. ఈ కార్యక్రమ వివరాలను ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. 21వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. దేశంలో అత్యుత్తమ క్యాన్సర్ చికిత్స సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు.

ఈ ఆసుపత్రిని తమ తల్లిగారైన బసవతారకం పేరిట తమ తండ్రి గారు నందమూరి తారక రామారావు స్థాపించారని బాలకృష్ణ వెల్లడించారు. ఎంతోమంది గొప్ప దాతల సహకారంతో తన తండ్రి ఆశయం నిర్విఘ్నంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. భారత్ లో ఉన్న అత్యుత్తమ క్యాన్సర్ ఆసుపత్రుల్లో తమది కూడా ఒకటని గర్వంగా చెప్పగలనని బాలకృష్ణ వివరించారు. కరోనా సంక్షోభ సమయంలోనూ క్యాన్సర్ రోగులకు ఎలాంటి అవాంతరాలు లేకుండా వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు.