తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నస్రత్​ పెళ్లిపై ముసురుతున్న వివాదం!

22-06-2021 Tue 14:56
  • చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు బీజేపీ ఎంపీ లేఖ
  • సభకు తప్పుడు సమాచారం ఇచ్చిందని ఫిర్యాదు
  • తమ పెళ్లి చెల్లదని అంతకుముందు నస్రత్ వ్యాఖ్యలు
Row Over Nusrat Jahaan Marital status Reaches Parliament

బెంగాలీ సినీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నస్రత్ జహాన్ వివాహంపై వివాదం ముసురుతోంది. నిఖిల్ జైన్ అనే వ్యాపార వేత్తను పెళ్లి చేసుకున్న ఆమె.. ఇటీవలే తెగదెంపులు చేసుకుంది. అసలు ఆ వివాహానికి చట్టబద్ధత లేదని కామెంట్ చేస్తూ విడిపోయింది. దానికి విడాకులు అవసరమే లేదని తెలిపింది.

అయితే, ఇప్పుడు అది రాజకీయ వివాదంగా మారిపోయింది. లోక్ సభ బయో డేటాలో ఆమె పెట్టిన మారిటల్ స్టేటస్ పై వివాదం రేగింది. ఆమెపై లోక్ సభ ఎథిక్స్ కమిటీతో విచారణ చేయించాలని కోరుతూ స్పీకర్ ఓం బిర్లాకు బీజేపీ ఎంపీ సంఘమిత్ర మౌర్య లేఖ రాశారు. పెళ్లి చేసుకున్నట్టు పార్లమెంట్ కు ఆమె తప్పుడు సమాచారం ఇచ్చిందన్నారు.

‘‘లోక్ సభ బయో డేటాలో పెళ్లి చేసుకున్నట్టు నస్రత్ పేర్కొంది. భర్త పేరును నిఖిల్ జైన్ గా వెల్లడించింది. నస్రత్ జహాన్ రూహీ జైన్ గా ప్రమాణం చేసింది. ఇప్పుడేమో వాళ్లది అసలు పెళ్లే కాదంటోంది. అందుకే ఆమెపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు లేఖ రాశాను’’ అని సంఘమిత్ర మౌర్య అన్నారు.