దేవెగౌడకు షాక్.. రూ. 2 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని కోర్టు తీర్పు

22-06-2021 Tue 14:48
  • 2011లో నైస్ సంస్థపై విమర్శలు చేసిన దేవెగౌడ
  • నైస్ ఒక దోపిడీ సంస్థ అన్న మాజీ ప్రధాని
  • పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలను అనుమతించలేమన్న కోర్టు
Court ordes Ex PM Deve Gowda to pay 2 cr in defamatory case

మాజీ ప్రధాని దేవెగౌడకు బెంగళూరులోని ఎనిమిదో సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు షాకిచ్చింది. ఎప్పుడో పదేళ్ల క్రితం దేవెగౌడ చేసిన వ్యాఖ్యలకు పరువునష్టం దావా చెల్లించాలని తీర్పును వెలువరించింది.

వివరాల్లోకి వెళ్తే... బీదర్ సౌత్ మాజీ ఎమ్మెల్యే అశోక్ ఖేనీ మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న నంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ఎంటర్ ప్రైజెస్ (నైస్) సంస్థ గురించి దేవెగౌడ విమర్శించారు. నైస్ ఒక దోపిడీ ప్రాజెక్టు అని వ్యాఖ్యానించారు. 2011 జూన్ నెలలో ఓ ఇంటర్వ్యూలో ఆయన సదరు సంస్థపై తీవ్ర ఆరోపణలు చేశారు. 'గౌడర గర్జనే' పేరుతో ఓ వార్తా ఛానల్ ఆ ఇంటర్వ్యూని ప్రసారం చేసింది.

ఈ వ్యాఖ్యలపై సదరు సంస్థలో పరువు నష్టం దావా వేసింది. దేవెగౌడ వ్యాఖ్యల వల్ల తమ సంస్థ పరువు నష్టం జరిగిందని కోర్టును ఆశ్రయించింది. ఈ అంశంపై సుదీర్ఘంగా విచారణ జరిపిన న్యాయస్థాయం ఈరోజు తీర్పును వెలువరించింది. నైస్ సంస్థకు నష్ట పరిహారంగా రూ. 2 కోట్లను చెల్లించాలని దేవెగౌడను ఆదేశించింది. పరువు నష్టం కలిగించే ఇలాంటి వ్యాఖ్యలను అనుమతించలేమని... వీటిని అనుమతిస్తే, భవిష్యత్తులో ఇలాంటి భారీ ప్రాజెక్టును అమలు చేయడం కష్టమవుతుందని కోర్టు వ్యాఖ్యానించింది.