Mudragada Padmanabham: సమాజ సేవ చేసిన క్షత్రియులు, వైశ్యులు, బ్రాహ్మణులను అవమానించొద్దు: జగన్ కు ముద్రగడ లేఖ

  • అశోక్ గజపతిరాజుది మహారాజుల కుటుంబం
  • వేల ఎకరాల భూమిని ధారాదత్తం చేసిన చరిత్ర వారిది
  • అశోక్ రాజుని జైలుకి పంపుతామని విజయసాయి అనడం బాధాకరం
Mudragada writes letter to Jagan

రెండు తెలుగు రాష్ట్రాల్లోని క్షత్రియులు చేసుకున్న విన్నపాలను పరిశీలించాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్ కు కాపు సామాజికవర్గ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. రాజ్యాలు పోయినా మహారాజుల కుటుంబాలను ప్రజలు గౌరవిస్తారని లేఖలో పేర్కొన్నారు. మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ గా బాధ్యతలను స్వీకరించిన అశోక్ గజపతిరాజును జైలుకు పంపుతామంటూ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధాకరమని అన్నారు. జగన్ కు ముద్రగడ పద్మనాభం రాసిన లేఖ పూర్తి సారాంశం ఇదే.

"రెండు రాష్ట్రాల గౌరవ క్షత్రియ సమాజం వారు తమరికి దినపత్రికలో యాడ్ ద్వారా చెప్పుకున్న విన్నపమును సీరియస్ గా పరిశీలించమని కోరుకుంటున్నాను.

గౌరవ అశోక్ గజపతిరాజు గారిది మహారాజుల కుటుంబం. వారి తాత, తండ్రి గార్ల నుంచి ఎన్నో దేవాలయాలు కట్టడానికి ఆర్థిక సహాయంతో పాటు, వేల ఎకరాల భూమిని ధారాదత్తం చేశారండి. వాటికి ట్రస్టులు ఏర్పాటు చేసి, నిత్య పూజా కార్యక్రమాలు చేస్తున్న సంగతి మీకు తెలియనిది కాదు. చదువుకునే పిల్లలకు స్కూళ్లు, వాటికి కావాల్సిన సదుపాయాలు చేసినవారండి. రాజ్యాలు పోయినా... మహారాజ కుటంబం అని అందరూ గౌరవిస్తారండి.

ఈ మధ్య మాన్సాస్ ట్రస్టు విషయంలో గౌరవ హైకోర్టు ఆదేశాల ప్రకారం అశోక్ గజపతిరాజు తిరిగి ఛార్జ్ తీసుకున్న తర్వాత... గౌరవ ఎంపీ విజయసాయిరెడ్డి గారు తొందరలో రాజు గారిని జైలుకు పంపుతామని అనడం చాలా బాధాకరం. అశోక్ రాజు, నేను కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్ మంత్రులుగా అసెంబ్లీలో ఒకే సోఫాలో కూర్చునేవారము. ఎప్పుడైనా, ఎవరినైనా వారు అగౌరవమైన భాషలో మాట్లాడటం నేను చూడలేదండి.

ఈ రోజుకీ మా ప్రాంతం వారు క్షత్రియులను, వెలమ దొరలను ఎప్పుడూ పేరుతో పిలవరండి. దివాణం/దొర అనే సంబోధిస్తారు. అప్పటి గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి గారు ఏ సీఎం పొందని గౌరవం పొందారంటే వారు చేసిన మంచి పనులు, ఎముకలేని విధంగా చేసిన ఉపకారాలు ఎవరూ మర్చి పోరండి. వారు హెలికాప్టర్ ప్రమాదానికి గురైనప్పుడు ప్రజల గుండె తల్లడిల్లిపోయింది. దేశం మొత్తం వెతకడానికి శాటిలైట్ మరో మార్గాల ద్వారా అప్పటి ప్రధాని గారు, సోనియాగాంధీ గారు చేసిన ప్రయత్నం చిన్న విషయం కాదండి. శత్రువు కూడా ప్రేమించే స్థాయికి వైయస్ వెళ్లారు. ఆ స్థాయికి మీరు... ఆ మహానాయకులకి అంత దగ్గరకి కాకపోయినా ఇంచుమించుగా ఆ కోవకు చెందిన వారండి.

పూర్వం వీరితో పాటు వైశ్యులు, బ్రాహ్మణులు పేద పిల్లల చదువుల కోసం భూములు దానం ఇవ్వడంతో పాటు, బిల్డింగుల కోసం ధన సహాయం చేసి, వారి పేర్లు పెట్టమని కోరేవారు. దయచేసి పూర్వం గౌరవంగా జీవించిన వారిని అవమానించే కార్యక్రమాన్ని తీసుకోవద్దని మీ గౌరవ నాయకులకు ఆదేశాలను జారీ చేయమని కోరుతున్నాను" అని ముద్రగడ తన లేఖలో పేర్కొన్నారు.

More Telugu News